బండి భగీరథ్ అరెస్టుకు టీజేఎస్ మహిళా విభాగం డిమాండ్

  • చట్టం అధికారంలో ఉన్నవారికి చట్టం కాదు
  • నేరం చేసిన వాళ్ళు ఎంతటి వాళ్ళైన అరెస్ట్ చేయాల్సిందే
  • మహిళా కమీషన్ కి టీజేఎస్ మహిళా నాయకురాళ్ల వినతి

హైదరాబాద్/ధనాధన్ న్యూస్ మే 16:
మైనర్ బాలికపై అత్యాచారం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌ను తక్షణమే అరెస్ట్ చేయాలని తెలంగాణ జన సమితి (టీజేఎస్) మహిళా విభాగం రాష్ట్ర మహిళా కమిషన్‌ను కోరింది. ఈ మేరకు టీజేఎస్ మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు అరికిల్ల స్రవంతి, ముత్తు గీతాంజలి, మహిళా నాయకురాలు లావణ్య శనివారం మహిళా కమిషన్ చైర్మన్‌కు వినతిపత్రం సమర్పించారు.


వినతిపత్రంలో వారు పేర్కొన్నదేమిటంటే… బాధిత మైనర్ బాలిక కుటుంబం చేసిన ఫిర్యాదు మేరకు ఇప్పటికే పోక్సో చట్టం కింద కేసు నమోదైనప్పటికీ, ఇప్పటివరకు నిందితుడిపై అరెస్ట్ చర్యలు చేపట్టకపోవడం అనుమానాలకు తావిస్తోందని అన్నారు. రాజకీయ ప్రభావం కారణంగానే పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.


“చట్టం ముందు అందరూ సమానమే. కానీ అధికారంలో ఉన్న వారి కుటుంబాలకు ప్రత్యేక రక్షణ లభిస్తున్నట్టుగా కనిపిస్తోంది. సాధారణ వ్యక్తుల విషయంలో పోలీసులు వెంటనే స్పందిస్తారు. కానీ ఈ కేసులో మాత్రం ఆలస్యం జరుగుతోంది” అని వారు విమర్శించారు.
అదేవిధంగా, నిందితుడికి ఉన్న రాజకీయ పలుకుబడి కారణంగా దర్యాప్తు ప్రభావితమయ్యే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. కేసు విచారణలో ఆలస్యం వల్ల బాధిత బాలికకు న్యాయం దూరమవుతుందని పేర్కొన్నారు.


ఈ నేపథ్యంలో నిందితుడు బండి భగీరథ్‌ను వెంటనే అరెస్ట్ చేసి, బాధిత కుటుంబానికి భద్రత కల్పించడంతో పాటు పూర్తి న్యాయం చేయాలని రాష్ట్ర మహిళా కమిషన్‌ను టీజేఎస్ మహిళా విభాగం డిమాండ్ చేసింది. ఈ కార్యక్రమంలో పలువురు టీజేఎస్ మహిళా నాయకురాళ్లు పాల్గొన్నారు.

Leave a comment