- పార్లమెంట్ పరిధిలో ఈసారి హస్తానికి బలమేక్కువే
- బలమైన అభ్యర్థిని బరిలో నిలిపితే గెలుపు పక్కా
- ఉమ్మడి జిల్లాలోని రెండు పార్లమెంట్ స్థానాలపై కాంగ్రెస్ కన్ను
- చక్రం తిప్పనున్న ఇద్దరు జిల్లా మంత్రులు పొన్నం,దుద్దిళ్ల
ఎడిటర్ డెస్క్,ధనాధన్ న్యూస్:
రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ..పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటేందుకు సమాయత్తమవుతోంది.ఈ నేపథ్యంలో కరీంనగర్ పార్లమెంట్ స్థానం గురించి ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది.ప్రధాన రాజకీయ పార్టీలన్నీ కూడా కరీంనగర్ నే టార్గెట్ చేస్తున్నాయి. కాగా, ఈ సారి కరీంనగర్ పార్లమెంట్ స్థానం తప్పనిసరిగా కాంగ్రెస్ ఖాతాలోనే నమోదయ్యే విధంగా అధిష్టానం కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకు అనుగుణంగా బలమైన అభ్యర్థిని బరిలో దింపితే గెలుపు అవకాశాలు తప్పనిసరిగా ఎక్కువగానే ఉన్నాయని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడకముందు కరీంనగర్ సిట్టింగ్ కాంగ్రెస్ ఎంపీగా ఉన్న పొన్నం ప్రభాకర్ ప్రస్తుతం రాష్ట్ర మంత్రిగా ఉన్నారు. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ కు ఎక్కువ స్థానాలే ఉన్నాయి. అది కూడా హస్తం గెలుపునకు కలిసొచ్చే అంశమే.ఈ నేపథ్యంలో పార్టీలోకి నాయకులను తిరిగి తీసుకురావడంతో పాటు క్షేత్రస్థాయిలో పార్టీలోని బలోపేతం చేస్తున్నారు. కరీంనగర్ లోక్ సభ పరిధిలో కరీంనగర్, మానకొండూరు, చొప్పదండి, వేములవాడ, సిరిసిల్ల, హుజురాబాద్, హుస్నాబాద్ అసెంబ్లీ స్థానాలున్నాయి. ఇందులో కరీంనగర్, సిరిసిల్ల హుజురాబాద్ ఈ 3 స్థానాలు మినహా మిగతా మెజారిటీ స్థానాలు నాలుగింటిల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలే ప్రాతినిథ్యం వహిస్తున్నారు. దానికి తోడు ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి ఇద్దరు మంత్రుల ప్రాతినిథ్యంతో పాటు ఆయా నియోజకవర్గాల్లో ఆయా కాంగ్రెస్ పార్టీ ఇన్ చార్జిలు పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడంతో పాటు ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా వ్యవహరిస్తున్నారు. ఇవన్నీ కూడా హస్తం ఖాతాలో కరీంనగర్ గెలుపు నమోదుకు కలిసొచ్చే అంశాలని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ మెదక్ తర్వాత కరీంనగర్ జిల్లాకు రాజకీయంగా ప్రాధాన్యతనిస్తూ వస్తున్నారు. అయితే, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో ఉంటారని ఇటీవల కేటీఆర్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ సమాయత్తమవుతోంది. కాగా, ఇప్పటికైతే ఇంకా క్షేత్రస్థాయిలో జనంలో బీఆర్ఎస్ పైన వ్యతిరేకతనే స్పష్టంగా కనబడుతోందని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ఇక సొంత పార్టీలోనే విభేదాలు బయటకు వస్తుండటం సిట్టింగ్ ఎంపీ బండి సంజయ్ కుమార్ తలనొప్పిగా మారిందనే చర్చ ఆ పార్టీ రాజకీయ వర్గాల్లో ఉంది. సరైన అభ్యర్థిని పరిశీలించి బరిలోకి దింపితే తప్పనిసరిగా కాంగ్రెస్ విజయం కరీంనగర్ లో ఖాయం అనే అభిప్రాయాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీని బలంగా ప్రజలలోకి తీసుకెళ్లడంతో పాటు నూతన ప్రభుత్వ విధానాలపైన ఆశావాద దృక్పథంతో ఉన్న జనాన్ని తమ వైపునకు తిప్పుకుని..ప్రజల విశ్వాసంతో..వారి మద్దతు చూరగొని.. కరీంనగర్ ఎంపీ స్థానం కైవసం చేసుకోవచ్చనే అభిప్రాయాన్ని కొందరు హస్తం పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు.
