విద్యా విధానంలో మార్పుతోనే యువతకు ఉపాధి

By dhanadhannews.com

  • బిఎన్ రావు ఫౌండేషన్ అధ్యక్షుడు,డాక్టర్ బి.యన్ రావు
  • ప్రస్తుత విద్యా విధానం – నిరుద్యోగ సమస్య అనే అంశంపై చర్చా గోష్టి
  • దేశవ్యాప్తంగా ఒకే విద్యా విధానం తీసుకురావాలి
  • కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యారంగానికి నిధులు కేటాయించాలి
  • వృత్తి శిక్షణ కేంద్రాలతో నైపుణ్యత పెంచాలి
  • ధనార్జనే కాకుండా సేవా దృక్పథంతో పనిచేయాలి

కరీంనగర్ టౌన్/ధనాధన్ న్యూస్,అక్టోబర్ 6: ప్రస్తుత విద్యా విధానం మార్పుతోనే యువతకు ఉపాధి లభిస్తుందని బి.ఎన్.రావు ఫౌండేషన్ అధ్యక్షుడు, డాక్టర్ బి.యన్ రావు అన్నారు. ప్రస్తుత విద్యా విధానం- నిరుద్యోగ సమస్య అనే అంశంపై ఫిలిం భవన్ లో ఆదివారం నిర్వహించిన చర్చ గోష్టిలో పలువురు వక్తలు మాట్లాడారు. మనదేశంలో ప్రస్తుత విద్యా విధానం కేవలం పాస్ మార్కుల మీదనే కేంద్రీకృతమై ఉందని వివరించారు. నాణ్యమైన విద్యను పొందాలంటే సాంప్రదాయ విద్యకు స్వస్తి పలకాలని వివరించారు. సమకాలీన కాలంలో అభివృద్ధి చెందిన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకునేలా విద్యా విధానాన్ని రూపొందించాలని తెలిపారు.  నాణ్యమైన విద్యను అందించాలంటే తొలుత పాఠశాలల్లో, కాలేజీల్లో, యూనివర్సిటీల్లో మౌలిక వసతులకు ప్రాధాన్యమివ్వాలి. సరైన టీచింగ్ స్టాపును అందుబాటులో ఉంచాలని సూచించారు. కాలేజీల్లో, యూనివర్సిటీల్లో ఒకరి వద్ద పని నేర్చుకునే విధానాన్ని (అస్సెంటిష్ షిప్) శిక్షణ విధానాన్ని, లేబరేటరీ పరిశోధన అనుభవాలు, ప్రణాళికలు రచించుకునే విధానాన్ని ప్రవేశపెట్టాలని పేర్కొన్నారు.  నాణ్యమైన విద్య లభించకపోవటంతో దేశంలోని లక్షలాది మంది యువత విదేశాలకు వెళ్లి చదువుతున్నారని,  దాంతో మన దేశ సంపద బయటి దేశాలకు వలస వెళుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యా విధానం పైన పర్యవేక్షణ పద్ధతిని ఏర్పాటు చేసే అవసరం ఎంతైన ఉందని వివరించారు.