- జాతర సమయానికల్లా అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తాం
- మేడారం మాస్టర్ ప్లాన్ అమలు – భక్తుల సౌలభ్యం ప్రధాన లక్ష్యం
హైదరాబాద్, సెప్టెంబర్ 03:
సమ్మక్క–సారలమ్మల త్యాగ ఔన్నత్యానికి తగిన వేడుకగా మేడారం మహా జాతరను నిర్వహిస్తామని మంత్రి దనసరి అనసూయ సీతక్క ప్రకటించారు. జాతర ప్రారంభానికి ముందుగానే అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆమె అధికారులను ఆదేశించారు.
సచివాలయంలో జరిగిన సమీక్ష సమావేశంలో దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరు లక్ష్మణ్ కుమార్, ఉన్నతాధికారులు, ములుగు జిల్లా కలెక్టర్ దివాకర్, వివిధ విభాగాల ఇంజనీర్లు పాల్గొన్నారు. సమ్మక్క–సారలమ్మ పూజారుల సూచనల మేరకు దేవాలయ ప్రాంగణ నూతన డిజైన్‌ను పరిశీలించిన మంత్రులు, అవసరమైన మార్పులపై చర్చించి సూచనలు చేశారు.
ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ –
భక్తుల దర్శనార్థం సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజుల గద్దెలను ఒకే వరుసలో అమర్చేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని,పూజారుల అభ్యర్థన మేరకు గద్దెల ఎత్తు పెంపుపై చర్యలు తీసుకుంటామని,జాతరలో భక్తులకు సహాయం అందించేందుకు వాలంటీర్లను నియమించనున్నామని తెలిపారు.
అలాగే మేడారం చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 150 కోట్ల రూపాయలు కేటాయించినట్లు వెల్లడించిన ఆమె, అవసరమైతే ఇతర శాఖల సహకారంతో మరిన్ని నిధులు కూడా కేటాయిస్తామని చెప్పారు.
ఆదివాసీ సంప్రదాయాలు ప్రతిబింబించేలా మేడారం పరిసరాలను తీర్చిదిద్దుతున్నామని, పూజారుల భాగస్వామ్యంతోనే ప్రతి దశలో అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. ఆలయ ప్రాంగణంతో పాటు పరిసర ప్రాంతాల్లోని దేవాలయాలను కూడా ప్రత్యేకంగా అలంకరించాలని ఆదేశించారు.
ప్రభుత్వం భక్తులందరికీ సౌకర్యవంతమైన వాతావరణం కల్పించేందుకు కట్టుబడి ఉందని, ఈ మహా జాతరను విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు చేపడుతున్నట్లు మంత్రులు సమావేశంలో స్పష్టం చేశారు.
