ఎన్నికల షెడ్యూల్‌పై ఈటల రాజేందర్ ఆగ్రహం

By dhanadhannews.com

  • “ప్రజలను వంచించవద్దు – ఎన్నికలు షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని ప్రభుత్వం హామీ ఇవ్వాలి”
  • “కోర్టుకు వెళ్లొద్దు” అని చెప్పడం వెనుక భయం ఏమిటి? – ఈటల
  • ఎన్నికలు రద్దయితే అభ్యర్థుల ఖర్చుకు ఎవరు బాధ్యులు?
  • బీసీ రిజర్వేషన్లకు బీజేపీ సంపూర్ణ మద్దతు
  • ప్రభుత్వం ప్రజలను గందరగోళానికి గురి చేయొద్దు

హుజురాబాద్/ధనాధన్ న్యూస్ :
స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌పై ఎంపీ ఈటల రాజేందర్ మండలాల వారీగా పార్టీ నాయకులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం కమలాపూర్‌లోని తన నివాసంలో మీడియాతో మాట్లాడారు.

రిజర్వేషన్లలో పెద్ద ఎత్తున తప్పులు

ఈటల మాట్లాడుతూ – రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రకటించిన రిజర్వేషన్లలో అనేక పొరపాట్లు జరిగాయని అన్నారు.
బీసీలు లేని తండాలకు బీసీ రిజర్వేషన్, ఎస్సీలు లేని గ్రామాలకు ఎస్సీ రిజర్వేషన్ కేటాయించడం బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని విమర్శించారు.

“కోర్టుకు వెళ్లొద్దని ఎందుకు అంటున్నారు?”

“ఎంపెరికల్ డేటా సేకరించాం, కమిషన్ వేసాం, అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేశాం అంటున్నారు. ఇంత చేసిన తర్వాత కూడా కోర్టుకు వెళ్లొద్దని చెప్పడం వెనుక భయం ఏమిటి?” అని ఈటల ప్రశ్నించారు.
బీహార్, మహారాష్ట్రల్లో రిజర్వేషన్ల సమస్యతో ఎన్నికలు రద్దయిన ఉదాహరణలు గుర్తు చేశారు.

అభ్యర్థుల ఖర్చుకు ఎవరు బాధ్యులు?

ఎన్నికలు రద్దయితే అభ్యర్థులు పెట్టుకున్న ఖర్చుకు ఎవరు బాధ్యులని ప్రశ్నించారు.
“వేలాది మంది పోటీకి సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ఖర్చులు చేస్తున్నారు. దసరా పండుగ సమయంలో ఈ భారం మరింత పెరుగుతుంది” అని ఆందోళన వ్యక్తం చేశారు.

ప్రభుత్వానికి సూచన

ప్రభుత్వం ఎనిమిదవ తేదీ కోర్టు తీర్పు వచ్చిన తర్వాతే నోటిఫికేషన్ ఇవ్వాల్సిందని సూచించారు.
“అదరాబాదరగా షెడ్యూల్ ప్రకటించి ప్రజలను ఇబ్బందులకు గురి చేయొద్దు” అని హెచ్చరించారు.

బీసీలకు సంపూర్ణ మద్దతు

42 శాతం బీసీ రిజర్వేషన్లకు బీజేపీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని, అణగారిన వర్గాలకు ఎలాంటి నష్టం జరగకుండా తాము అండగా ఉంటామని ఈటల స్పష్టం చేశారు.

అసెంబ్లీ తీర్మానాన్ని తిరస్కరించడం తప్పు

అసెంబ్లీలో తీర్మానానికి మద్దతు ఇచ్చిన తర్వాత మళ్లీ అఫిడవిట్ సమర్పించడం అనుభవ రాహిత్యమని ఈటల అన్నారు.
ప్రజాస్వామ్యానికి పట్టుకొమ్మలైన చట్టసభల్లో తీసుకున్న నిర్ణయాన్ని తిరస్కరించడం ప్రజలకు గందరగోళం కలిగిస్తుందని వ్యాఖ్యానించారు.


“ప్రజలకు నిజాయితీగా మార్గదర్శనం చేయాలి. ఎన్నికలు షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని ప్రభుత్వం స్పష్టంగా ప్రకటించాలి. అణగారిన వర్గాలకు ఎలాంటి నష్టం జరిగినా నేను, మా పార్టీ అండగా ఉంటాం” అని ఈటల రాజేందర్ హెచ్చరించారు.