పాత పద్ధతిలో హుజూరాబాద్‌ను మళ్లీ చేసుకుందాం

By dhanadhannews.com

కమలాపూర్/ధనాధన్ న్యూస్:
హన్మకొండ జిల్లా, కమలాపూర్ మండలం శనిగరం గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారంలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఎంపీ ఈటల రాజేందర్ పాల్గొన్నారు. సర్పంచ్ అభ్యర్థి కొత్తపల్లి రాజు (ఉంగరం గుర్తు), వార్డు మెంబర్ల తరఫున గ్రామంలో భారీ రోడ్ షో నిర్వహించి, ప్రజలనుద్దేశించి ప్రసంగించారు.

తన హుజూరాబాద్ నియోజకవర్గ అభివృద్ధిని ప్రస్తావిస్తూ, ఈటల రాజేందర్ తమ కృషిని గుర్తు చేశారు. “హుజూరాబాద్ నియోజకవర్గంలో రెండు వందల కోట్లతో ఫోర్ లైన్ రోడ్లు వేయించాం. ఎప్పుడూ ఎండిపోయే శనిగరం వాగుపై ప్రణాళికతో కానిపర్తి నుండి శంభునిపల్లి గోపాలపురం వరకు చెక్ డాంలు కట్టించి నీళ్లు నింపుతున్నాం,” అని తెలిపారు. అంతేకాకుండా, “5 వేల మంది విద్యార్థులు చదువుకునేలా ప్రభుత్వ విద్యాసంస్థలు ఏర్పాటు చేసుకున్నాం,” అని పేర్కొన్నారు.
అయితే, కొందరు తన అభివృద్ధి గురించి ప్రశ్నించడంపై ఆయన తీవ్రంగా స్పందించారు. “అలాంటి నన్ను పట్టుకొని ఆయన ఏం చేసిండు అని కొంతమంది అడుగుతున్నారు… మనుషులా పశువులా… కళ్ళు ఉన్నాయా లేవా?” అని ప్రశ్నించారు. “ఎక్కడ ఆపద కష్టం దుఃఖం ఉందో అక్కడ ఈటల ఉంటాడు. మీ వైద్యం, పిల్లల చదువులు, ఉద్యోగాలు, అభివృద్ధి అన్నిటి దగ్గరా నేను ఉన్నా,” అని స్థానికులకు భరోసా ఇచ్చారు.


గత ఎన్నికల్లో జరిగిన పొరపాటును ప్రజలు గుర్తు చేసుకుంటున్నారని ఈటల తెలిపారు. “మాయ చేసి బోల్తా కొట్టించి… ఈటల గజ్వేల్లో గెలుస్తున్నాడు నన్ను ఇక్కడ గెలిపించండి అని కొంగుపట్టి ఏడవగానే నమ్మాము… ఆగమైపోయినం అంటున్నారు,” అని ప్రజల అభిప్రాయాలను వెల్లడించారు. “అయిపోయింది అయిపోయింది ఇప్పుడు మన వాళ్ళని గెలిపించండి. పాత పద్ధతిలో హుజూరాబాద్‌ను మళ్లీ చేసుకుందాం. పోయిన గౌరవం తెచ్చుకుందాం,” అని ఓటర్లకు పిలుపునిచ్చారు.
మల్కాజిగిరిలో కూడా పేదల కోసం పోరాడుతున్నానని, తన 20 ఏళ్ల రాజకీయ జీవితంలో ‘లేదు కాదు’ అనే మాట తన నోటి నుండి రాలేదు అని ఆయన ఉద్ఘాటించారు.

శనిగరం పెద్ద గ్రామపంచాయతీ అని పేర్కొంటూ, తనపై గల విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. “గతంలో ఉన్న వారు నాతో లేకపోవచ్చు కానీ ప్రజలు నా వెంట ఉన్నారనే విశ్వాసం ఉంది,” అని తెలిపారు. “పదవి ప్రజలు ఆశీర్వదిస్తేనే వస్తుంది తప్ప కొనుక్కుంటే అడుక్కుంటేనో అమ్మ నాన్న ఇస్తే రాదు,” అని స్పష్టం చేశారు.

తెలంగాణలో అధికారంలో లేని పార్టీల బలంపై వ్యాఖ్యానిస్తూ, “బిఆరెస్ పార్టీ వారిది కత్తి కాదు నెత్తి కాదు. వారు అక్కడ అధికారంలో లేరు ఇక్కడా లేరు,” అని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ నేతలే తాము ‘అడుక్కునే స్థితిలో ఉన్నామని’ చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు.
కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న నిధుల గురించి ప్రజలకు వివరించారు. “మీరు తీసుకునే 6 కేజీల బియ్యంలో 5 కేజీలు మోదీగారి దగ్గర నుండి వస్తున్నాయి,” అని తెలిపారు. ఉపాధి హామీ పథకం కింద సెంట్రల్ మెటల్ కాంపౌండ్ నుండే సీసీ రోడ్లు, మురికి కాలువలు, రైతువేదికలు, స్మశాన వాటికలు, చెత్త షెడ్డులు, గ్రామపంచాయతీ భవనాలు వంటి నిర్మాణాలు జరుగుతున్నాయని తెలిపారు. “పెరిగే చెట్లు, వెలిగే లైట్లు అన్నీ కేంద్రం ఇస్తున్నవే. కేంద్రంలో మేమున్నాం కాబట్టి నిధులు తీసుకువస్తాం,” అని హామీ ఇచ్చారు.

రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితిపై ఈటల ఆందోళన వ్యక్తం చేశారు. “రాష్ట్రం దగ్గర సఫాయి కార్మికులకు జీతాలు ఇవ్వడానికి కూడా డబ్బులు లేవు,” అని పేర్కొన్నారు. పెండింగ్ బిల్లులు రాక సర్పంచులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఏర్పడిందని, మహిళలు కూడా పోటీ చేయడానికి ముందుకు రావడం లేదని వాపోయారు.
అయితే, ప్రభుత్వం తరఫు నుంచి వచ్చే బెదిరింపులకు ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని ధైర్యం చెప్పారు. “ఎవరు ఉన్నా పోయినా పెన్షన్లు, రేషన్ కార్డులు పోవు, ఆగవు. వీరి బెదిరింపులకు భయపడవద్దు. ప్రతి పైసా ప్రజలవే తప్ప ఎవడబ్బ జాగీరు కాదు,” అని స్పష్టం చేశారు.


కొత్తపల్లి రాజుకు మద్దతు కోరిన ఈటల
“హుజూరాబాద్ ప్రజలతో నాది 25 ఏళ్ల బంధం. నేను కమలాపూర్ మట్టి బిడ్డను,” అని తన స్థానికతను గుర్తు చేసుకున్నారు. కొత్తపల్లి రాజుపై నమ్మకం ఉంచాలని కోరుతూ, “కొత్తపల్లి రాజు పిలిస్తే పలికే బిడ్డగా ఉంటాడు. నిండు మనసుతో ఉంగరం గుర్తుకు ఓటు వేసి రాజును గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్న,” అంటూ ఈటల రాజేందర్ తన ప్రసంగాన్ని ముగించారు.