కబ్జాకు గురైన ప్రభుత్వ డిగ్రీ కళాశాల స్థలాన్ని కాపాడాలి

By dhanadhannews.com

  • కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కు వినతి పత్రం

జమ్మికుంట/ధనాధన్ న్యూస్:జమ్మికుంట పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు చెందిన విలువైన భూమిని కొంతమంది అక్రమంగా కబ్జా చేశారని, ఆ స్థలాన్ని తిరిగి కళాశాల పరిధిలోకి తీసుకురావాలని కోరుతూ కళాశాల పూర్వ విద్యార్థి, ప్రభుత్వ డిగ్రీ కళాశాల సీపీడీసీ సభ్యుడు టంగుటూరి రాజకుమార్ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్‌కు వినతి పత్రం అందజేశారు.
బుధవారం జమ్మికుంట ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో మంత్రి బండి సంజయ్‌ను కలిసిన రాజకుమార్, కళాశాల భూకబ్జా అంశంపై గత 23 ఏళ్లుగా జరుగుతున్న పరిణామాలను వివరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,
1997 నుంచి 2000 సంవత్సరాల మధ్య కళాశాల భూమి కబ్జాపై అనేక ఆందోళన కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. 2001–2002 సంవత్సరాలలో తెలంగాణ సాధన విద్యార్థి సేన వ్యవస్థాపక అధ్యక్షుడిగా కళాశాల ఎదుట 30 రోజుల పాటు రిలే నిరాహార దీక్షలు, మూడు రోజుల ఆమరణ నిరాహార దీక్ష నిర్వహించినట్లు వెల్లడించారు.2002 మార్చి 19న అప్పటి అలంపూర్ ఎమ్మెల్యే రావుల రవీంద్రనాథ్ రెడ్డి ఈ అంశాన్ని అసెంబ్లీలో లేవనెత్తగా, ప్రతిపక్ష నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి చర్చకు పట్టుబట్టారని తెలిపారు. దీనితో అప్పటి జిల్లా కలెక్టర్ సుమిత ధాబా ఆదేశాల మేరకు డీఆర్వో అజీమ్‌ను ప్రత్యేక విచారణ అధికారిగా నియమించారని పేర్కొన్నారు.విచారణ అనంతరం కళాశాల భూమి నిజంగానే అక్రమంగా కబ్జా అయినట్లు తేలిందని, దీనికి బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి నివేదిక అందజేసినట్లు తెలిపారు.కళాశాల స్థలంలో అక్రమంగా 24 ఇళ్లు నిర్మించారని, దీనిపై 2023 నవంబర్ 7న ల్యాండ్ అండ్ రెవెన్యూ అథారిటీ కమిషనర్ ద్వారా జీవో నెంబర్ 1115 జారీ అయినప్పటికీ ఇప్పటివరకు అమలు జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈలోగా 16 ప్లాట్లు మరింతగా అన్యాక్రాంతం కావడం జరిగిందన్నారు. ప్రభుత్వానికి నిర్ణయించిన రేటును ఇప్పటివరకు చెల్లించలేదని తెలిపారు.అక్రమ నిర్మాణాలకు రాత్రికి రాత్రే రోడ్లు నిర్మించారని ఆరోపించారు. కాబట్టి ఈ వ్యవహారంపై ఉన్నతస్థాయి విచారణ జరిపి, కళాశాల భూమిని పూర్తిగా రక్షించాలని మంత్రి బండి సంజయ్‌ను కోరారు.అలాగే, సింథటిక్ ట్రాక్ నిర్మాణానికి రూ.6.50 కోట్ల నిధులు మంజూరు చేసినందుకు పట్టణ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. ఆ ట్రాక్‌ను కళాశాల పరిధిలోనే ఏర్పాటు చేసేలా అనుమతులు ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు.
దీనిపై స్పందించిన కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ మాట్లాడుతూ,“ప్రభుత్వ భూముల కబ్జాలకు నేను మొదటి నుంచే వ్యతిరేకిని. ప్రభుత్వ స్థలాలను కబ్జా చేస్తే ఊరుకునేది లేదు. తప్పకుండా చర్యలు తీసుకుంటాం” అని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు ఏ.బూసి శ్రీనివాస్, బీసీ విద్యార్థి విభాగం హుజురాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ ఆవుల తిరుపతి, బీసీ సంక్షేమ సంఘం పట్టణ అధ్యక్షుడు ముద్రగడ నవీన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.