- అక్రమ అరెస్టులను ఖండించిన కొమ్ము నరేష్

జమ్మికుంట/ధనధన్ న్యూస్: తెలంగాణ ఉద్యమకారులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకుండా, అక్రమ అరెస్టులకు పాల్పడటం తీవ్రంగా ఖండనీయమని బీఆర్ఎస్వీ టౌన్ ప్రెసిడెంట్ కొమ్ము నరేష్ అన్నారు.
ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా “ఆరు గ్యారంటీలు” ప్రకటించిందని గుర్తుచేశారు. అందులో ఉద్యమకారులకు గుర్తింపు కార్డు,250 గజాల ఇల్లు స్థలం, ₹25,000 పెన్షన్ ఇవ్వాలని హామీ ఇచ్చినప్పటికీ, రెండున్నర సంవత్సరాలు గడిచినా ఇప్పటివరకు అమలు కాలేదని విమర్శించారు.
ఈ హామీల అమలు కోసం ఉద్యమకారులు అసెంబ్లీ ముట్టడికి సిద్ధమవుతుండగా, నిన్న రాత్రి పోలీసులు అక్రమ అరెస్టులు చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలంగాణ సాధన కోసం ఉద్యమకారులు చేసిన త్యాగాలను గుర్తు చేసుకుంటూ, “చావో రేవో తెలంగాణ వచ్చుడు” అన్న నినాదంతో వేలాది మంది పోరాడిన ఫలితంగానే ఈ రోజు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారని ఆయన పేర్కొన్నారు.
ప్రభుత్వం తక్షణమే ఇచ్చిన హామీలను అమలు చేయాలని, లేనిపక్షంలో మరోసారి భారీ ఉద్యమం చేపట్టాల్సి వస్తుందని హెచ్చరించారు.