డంపింగ్ యార్డు స్థల మార్పిడికి కట్టుబడి ఉన్నాం

  • ఎమ్మెల్యే పదవికి అనర్హుడు కౌశిక్ రెడ్డి,వెంటనే భర్తరఫ్ చేయాలి
  • పొలిటికల్ డైవర్షన్ కోసం కౌశిక్ రెడ్డి కొత్త నాటకం
  • హుజూరాబాద్ లో డంపింగ్ యార్డు నిర్మాణానికి కాంగ్రెస్ పార్టీ కూడా వ్యతిరేకం,ఇప్పటికే మున్సిపల్ లో వ్యతిరేకంగా తీర్మానం చేశాం

హుజురాబాద్/ధనాధన్ న్యూస్: హుజూరాబాద్ పట్టణంలో ఏర్పాటు చేయాలని ప్రతిపాదించిన డంపింగ్ యార్డు స్థలాన్ని మార్చేందుకు తాము కట్టుబడి ఉన్నామని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి వొడితల ప్రణవ్ తెలిపారు. గురువారం పట్టణంలోని కాంగ్రెస్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ప్రవర్తన ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ఉందని ఆరోపిస్తూ, ఆయనను వెంటనే ఎమ్మెల్యే పదవి నుంచి భర్తరఫ్ చేయాలని ప్రణవ్ డిమాండ్ చేశారు. సోషల్ మీడియాలో రీల్స్, లైకులు పొందడానికే పరిమితమై, ప్రజా సమస్యల పట్ల అవగాహన లేకుండా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ప్రజలను ఇబ్బంది పెట్టడం మానేసి సేవ చేయాలని సూచించారు.


హుజూరాబాద్‌లో డంపింగ్ యార్డు నిర్మాణానికి కాంగ్రెస్ పార్టీ ప్రారంభం నుంచే వ్యతిరేకమని, మున్సిపల్ సమావేశంలో దీనిపై వ్యతిరేక తీర్మానం కూడా ఆమోదించామని తెలిపారు. ఈ అంశాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం కౌశిక్ రెడ్డి వాడుకుంటున్నారని ఆరోపించారు.అసెంబ్లీలో సీనియర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి పట్ల కౌశిక్ రెడ్డి వ్యవహరించిన తీరు అభ్యంతరకరమని, దళిత నాయకుడిపై వివక్ష చూపడం బాధాకరమని ప్రణవ్ అన్నారు. గతంలో కూడా గవర్నర్, కులాలు, మతాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం, జర్నలిస్టులు, వ్యాపారులను బెదిరించడం వంటి చర్యలు ప్రజలను కలవరపెడుతున్నాయని పేర్కొన్నారు.


డంపింగ్ యార్డు సమస్యపై ఇప్పటికే అధికారులకు పూర్తి నివేదిక అందజేశామని, త్వరలో అఖిలపక్ష నాయకులతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలుసుకుంటామని తెలిపారు. ప్రజలకు హానికరమైన నిర్ణయాలు ప్రభుత్వం తీసుకోదని స్పష్టం చేశారు.
కౌశిక్ రెడ్డి తనపై ఉన్న కేసుల నుంచి దృష్టి మళ్లించేందుకు డంపింగ్ యార్డు అంశాన్ని రాజకీయంగా ఉపయోగించుకుంటున్నారని విమర్శించారు. 2022లో ప్రతిపాదన వచ్చినప్పుడు స్పందించని ఆయన, ఇప్పుడు ధర్నాలు, బంద్‌ల పేరుతో రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారని అన్నారు.దళిత బంధు అమలులో కూడా కౌశిక్ రెడ్డి నిర్లక్ష్యం చేశారని, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం లబ్ధిదారులకు పూర్తి స్థాయిలో సహాయం అందిస్తోందని ప్రణవ్ పేర్కొన్నారు.


రైతుల సాగునీటి అవసరాలపై స్పందిస్తూ, చివరి ఆయకట్టు వరకు నీరు అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ విషయాన్ని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా సానుకూలంగా స్పందించారని చెప్పారు. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు.
ఈ సమావేశంలో మున్సిపల్ చైర్మన్ సుహాసిని, కౌన్సిలర్లు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Leave a comment