
జమ్మికుంట/ధనాధన్ న్యూస్ జూన్ 4: దళితబంధు రెండో విడతను వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ జమ్మికుంట పట్టణంలో దళితబంధు సాధన సమితి ఆధ్వర్యంలో గురువారం మీడియా సమావేశం నిర్వహించారు.అనంతరం సమితి నాయకులు జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. సమస్యపై వెంటనే స్పందించిన చైర్మన్, సంబంధిత శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, జిల్లా కలెక్టర్ మరియు ఎస్సీ కార్పొరేషన్ ఈడీతో ఫోన్‌లో మాట్లాడి, ఒక వారంలో సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని లబ్ధిదారులకు హామీ ఇచ్చారు.

ఈ సందర్భంగా దళితబంధు సాధన సమితి నాయకులు మాట్లాడుతూ, 2025 జనవరి 28న జారీ చేసిన ఆదేశాల ప్రకారం ఎలాంటి విచారణ లేకుండానే 7 వేల మందికి పైగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా నిధులు జమ చేయాలని కలెక్టర్‌కు సూచనలు ఉన్నప్పటికీ, ప్రస్తుతం మూడు దశల విచారణ పేరుతో లబ్ధిదారులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. దీంతో దళితబంధు పథకం అమలు కష్టతరంగా మారిందని విమర్శించారు.
ప్రభుత్వం ఎలాంటి అదనపు ఆంక్షలు, విచారణలు లేకుండా అర్హులైన లబ్ధిదారులకు నేరుగా దళితబంధు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఇంకా మిగిలి ఉన్న సుమారు 5 వేల కుటుంబాలకు నెలరోజుల్లో గ్రౌండింగ్ ప్రక్రియ పూర్తి చేసి, దళితుల పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని సాధన సమితి నాయకుడు కొలుగూరి నరేష్ పేర్కొన్నారు.
మే 25, 2025 నుంచి నవంబర్ 18 వరకు ఐదు నెలల కాలంలో కేవలం 1,060 మందికి మాత్రమే గ్రౌండింగ్ ప్రక్రియ పూర్తయిందని, మిగిలిన 5 వేల కుటుంబాలకు ఎప్పుడు అమలు చేస్తారో ప్రభుత్వం స్పష్టం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
దళితబంధు రెండో విడత సాధన కోసం 22 నెలల పాటు నిరంతర పోరాటం చేసిన 20 నుంచి 25 మంది నాయకులు ఇప్పటికీ లబ్ధి పొందలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వాపోయారు. పోరాటంలో ముందున్న నాయకులను విస్మరించి, ఇతరులకు ప్రాధాన్యం ఇవ్వడం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు.
ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రత్యేక చొరవ తీసుకుని సాధన సమితి నాయకుల దరఖాస్తులను పరిశీలించి, వారానికి లోగా న్యాయం చేయాలని కోరారు.అలాగే తమ సమస్యల పరిష్కారానికి స్పందించిన జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో దళితబంధు సాధన సమితి నాయకులు కొలుగూరి నరేష్, కోడెపాక రక్షిత్, అకినపల్లి జయ, జీడి అరుణ, పాత రాజేష్, రామంచ శ్రీకాంత్, వంశీ తదితరులు పాల్గొన్నారు.