- సమాచార కమిషన్ ఆదేశాలు బేఖాతర్.. ఫుటేజీలు లేవంటున్న పోలీసులు
- హత్యాయత్నం కేసు సీసీ ఫుటేజీలు అదృశ్యం.. దర్యాప్తు కోరిన జర్నలిస్టు
- సీసీటీవీ ఫుటేజీల అదృశ్యంపై కేసు నమోదు చేయాలని ఎస్సైకి వినతి
- సీనియర్ జర్నలిస్టు చుక్క గంగారెడ్డి వినతి

బుగ్గారం/ధనాధన్ న్యూస్,జూన్ 13: జగిత్యాల జిల్లా బుగ్గారం పోలీస్ స్టేషన్‌లో సీసీటీవీ ఫుటేజీలు అదృశ్యమైన ఘటనపై కేసు నమోదు చేసి సమగ్ర దర్యాప్తు చేపట్టాలని సీనియర్ జర్నలిస్టు చుక్క గంగారెడ్డి శనివారం బుగ్గారం ఎస్సై జి. సతీష్‌కు ఫిర్యాదు చేశారు.
ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ, 2022 మే 1న బుగ్గారం పోలీస్ స్టేషన్ ఎదుట తనపై హత్యాయత్నం దాడి జరిగిందని తెలిపారు. ఆ ఘటనకు సంబంధించి అప్పటి ఎస్సై గుడికందుల సందీప్ కేసు నమోదు చేశారని చెప్పారు. పోలీస్ స్టేషన్ ఆవరణలోని సీసీ కెమెరాలతో పాటు గ్రామంలోని ఓ హోటల్ వద్ద ఉన్న సీసీ కెమెరాల్లో కూడా దాడికి సంబంధించిన దృశ్యాలు రికార్డయ్యాయని పేర్కొన్నారు.దాడి జరిగిన రోజే సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) ద్వారా ఆ ఫుటేజీలను అందించాలని దరఖాస్తు చేసినట్లు తెలిపారు. అప్పటి ఎస్సై గుడికందుల సందీప్ ఫుటేజీలను పరిశీలించి, రెండు పెన్‌డ్రైవ్‌లలో కాపీ చేసి భద్రపరిచారని, ఒకటి కోర్టుకు, మరొకటి ఉన్నతాధికారుల అనుమతి తర్వాత తనకు అందజేస్తామని చెప్పారని వెల్లడించారు.
అయితే అనంతరం అధికారుల మార్పులు జరిగినప్పటికీ ఫుటేజీలు తనకు అందజేయలేదని గంగారెడ్డి ఆరోపించారు. దీనిపై మొదట ధర్మపురి సీఐ కార్యాలయానికి అప్పీల్ చేసినా ఫలితం లేకపోవడంతో తెలంగాణ రాష్ట్ర సమాచార కమిషన్‌ను ఆశ్రయించినట్లు తెలిపారు.
ఇటీవల మే 16న జగిత్యాల కలెక్టరేట్‌లో జరిగిన సమాచార కమిషన్ విచారణలో బుగ్గారం ఎస్సై జి. సతీష్ హాజరయ్యారని, నాలుగు రోజుల్లో సమాచారం అందజేస్తామని కమిషన్ ఎదుట హామీ ఇచ్చారని చెప్పారు. సమాచారాన్ని అందజేయకపోతే తగిన చర్యలు తీసుకుంటామని కమిషన్ హెచ్చరించినప్పటికీ, అనంతరం తనకు పంపిన లేఖలో 2022 మే 1 నాటి సీసీటీవీ ఫుటేజీలు అందుబాటులో లేవని పేర్కొన్నారని తెలిపారు.
సమాచార కమిషన్ ఆదేశాల అనంతరం కూడా ఫుటేజీలు అందించకపోవడం, అవి మాయమైనట్లు తెలియజేయడం అనుమానాలకు తావిస్తోందని గంగారెడ్డి అన్నారు. ఫుటేజీలు అదృశ్యమవడానికి బాధ్యులైన అధికారులు, సంబంధిత వ్యక్తులపై కేసు నమోదు చేసి విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు.
అలాగే మాయమైన సీసీటీవీ ఫుటేజీలను వెలికితీసి సమాచార హక్కు చట్టం ప్రకారం తనకు అందజేయాలని, ఈ వ్యవహారంలో చట్టపరమైన న్యాయం చేయాలని ఎస్సైని కోరారు.