డా.బి.ఆర్.అంబేద్కర్ గొప్పతనాన్ని ప్రతి పౌరుడు తెలుసుకోవాలి

  • అంబేద్కర్ ఆశయాలను స్మరణతో పాటు ఆచరణలోనూ కొనసాగించాలి
  • బడుగు,బలహీన వర్గాలు ఐక్యతతో ముందుకు సాగాలి: జర్నలిస్టు మల్యాల సతీష్ కుమార్

జగిత్యాల/ధనాధన్ న్యూస్,జూన్ 14:జగిత్యాల జిల్లా కేంద్రంలో ప్రబుద్ధ భారత్ ఇంటర్నేషనల్, డిక్కీ ఆధ్వర్యంలో ప్రతి ఆదివారం నిర్వహించే అంబేద్కర్ స్మరణ కార్యక్రమం ఆదివారం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి తెలంగాణ ఎస్సీ, ఎస్టీ వర్కింగ్ జర్నలిస్టుల అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి, మెట్రో ఉదయం జిల్లా స్టాఫ్ రిపోర్టర్, సీఎంపీ న్యూస్ ఛానల్ అధినేత మల్యాల సతీష్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా మల్యాల సతీష్ కుమార్ మాట్లాడుతూ, దేశంలోని బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం అంబేద్కర్ జీవితాంతం పోరాడారని అన్నారు. భారత రాజ్యాంగం ద్వారా ప్రతి పౌరుడికి సమానత్వం, స్వేచ్ఛ, సామాజిక న్యాయం కల్పించేందుకు ఆయన విశేష కృషి చేశారని పేర్కొన్నారు.అంబేద్కర్ స్థాపించిన మూక్ నాయక్, జనతా, బహిష్కృత భారత్ వంటి పత్రికల ద్వారా అణగారిన వర్గాల సమస్యలను వెలుగులోకి తీసుకువచ్చారని తెలిపారు. రాజ్యాంగం కల్పించిన హక్కులు, అవకాశాలపై ప్రజలు అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు. నేటికీ కుల వివక్షకు పాల్పడుతున్న కొందరు అంబేద్కర్ గొప్పతనాన్ని తెలుసుకుని తమ ఆలోచనా విధానాన్ని మార్చుకోవాలని అన్నారు.

రాజ్యాంగ రూపకల్పనలో అంబేద్కర్ పోషించిన పాత్ర చారిత్రాత్మకమని, సమాజంలో ఐక్యత, సోదరభావం పెంపొందాలని ఆకాంక్షించారు. బహుజనులు రాజ్యాంగం పట్ల అవగాహన పెంపొందించుకుని సమిష్టిగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. యువత అంబేద్కర్ ఆలోచనలను అధ్యయనం చేసి సమాజాభివృద్ధికి వినియోగించుకోవాలని సూచించారు.డిక్కీ జిల్లా కో-ఆర్డినేటర్ నల్ల శ్యామ్ మాట్లాడుతూ, సమానత్వం, స్వేచ్ఛ, సామాజిక న్యాయం వంటి విలువలను దేశ ప్రజలకు అందించిన మహనీయుడు అంబేద్కర్ అని కొనియాడారు. అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. అంబేద్కర్ భావజాలాన్ని ప్రజల్లో విస్తృతంగా చాటిచెప్పేందుకు ప్రతి ఆదివారం ఈ స్మరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు.అంబేద్కర్ ఆశయాల సాధనకు విద్య, చైతన్యం, సామాజిక ఐక్యత అవసరమని, యువత ఆయన బాటలో నడుస్తూ సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి, పెన్షనర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు హరి అశోక్ కుమార్, మట్టిపూలు పత్రిక సంపాదకులు తక్కళ్ళ దేవయ్య, తెలంగాణ శక్తి ఎడిటర్ ఆనంతుల కాంతారావు, మాల మహానాడు ఆఫ్ ఇండియా జిల్లా అధ్యక్షులు చిత్తారి ప్రభాకర్, బీఎస్పీ జిల్లా అధ్యక్షులు బొల్లంపల్లి సంపత్ కుమార్, దళిత క్రిస్టియన్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు ముద్దమళ్ళ ఆనంద్ ప్రవీణ్ కుమార్, 16వ వార్డు కౌన్సిలర్ దుమాల రాజ్‌కుమార్, బొల్లం ప్రభాకర్, రుద్ర మనోహర్, సుంకరిపల్లి అశోక్, సిరికొండ మాజీ సర్పంచ్ దాసరి లచ్చయ్య, దమ్మ నర్సయ్య, న్యాయవాది రాగం రమేష్, దాసరి శ్రీనివాస్, దాసరి హరి, దాసరి రమేష్ తదితర అంబేద్కర్‌వాదులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

Leave a comment