న్యూఢిల్లీ, జూలై 8 (ధనాధన్ న్యూస్): తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని తాడిచెర్ల కోల్ బ్లాక్-2ను సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (ఎస్‌సీసీఎల్)కు కేటాయించాలంటూ పెద్దపల్లి లోక్‌సభ సభ్యుడు  చేసిన నిరంతర కృషి ఫలించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం తాడిచెర్ల కోల్ బ్లాక్-2ను ఎస్‌సీసీఎల్‌కు కేటాయించేందుకు ఆమోదం తెలిపింది.ఈ అంశంపై ఎంపీ వంశీకృష్ణ గడ్డం ఈ ఏడాది ఫిబ్రవరి 3న కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కి అధికారికంగా లేఖ రాసి, తెలంగాణ ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఎస్‌సీసీఎల్‌కు తాడిచెర్ల కోల్ బ్లాక్-2ను కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం పలుమార్లు కేంద్ర మంత్రిని కలిసి ఈ అంశంపై చర్చిస్తూ తెలంగాణ ప్రయోజనాలను వివరించారు.

తన లేఖలో తాడిచెర్ల కోల్ బ్లాక్-2 రాష్ట్రానికి వ్యూహాత్మకంగా, ఆర్థికపరంగా అత్యంత కీలకమని ఎంపీ పేర్కొన్నారు. ఈ బ్లాక్‌ను ఎస్‌సీసీఎల్‌కు కేటాయించడం ద్వారా స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభించడంతో పాటు బొగ్గు ఉత్పత్తి పెరగడం, ప్రాంతీయ పారిశ్రామికాభివృద్ధి వేగవంతం కావడం, రాష్ట్ర ఆదాయం పెరగడం వంటి ప్రయోజనాలు కలుగుతాయని వివరించారు. అలాగే సింగరేణికి ఉన్న సుదీర్ఘ అనుభవం, బాధ్యతాయుతమైన గనుల నిర్వహణ, పర్యావరణ పరిరక్షణలో సంస్థకు ఉన్న విశ్వసనీయతను కూడా కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లారు.ఎంపీ చేసిన విజ్ఞప్తిని సానుకూలంగా పరిశీలించిన కేంద్ర ప్రభుత్వం తాడిచెర్ల కోల్ బ్లాక్-2ను ఎస్‌సీసీఎల్‌కు కేటాయించేందుకు ఆమోదం తెలపడంతో తెలంగాణలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.

ఈ సందర్భంగా ఎంపీ వంశీకృష్ణ గడ్డం మాట్లాడుతూ, తెలంగాణ ప్రయోజనాలను గుర్తించి సానుకూల నిర్ణయం తీసుకున్న కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ నిర్ణయంతో సింగరేణి మరింత బలోపేతం కావడంతో పాటు ఉత్తర తెలంగాణలో పారిశ్రామికాభివృద్ధికి ఊతమివ్వడంతో పాటు ఉపాధి అవకాశాలు విస్తరిస్తాయని, రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి కూడా ఇది దోహదపడుతుందని ఆయన పేర్కొన్నారు.

Leave a Reply