- ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్, ఎస్పీ అశోక్ కుమార్

జగిత్యాల, ధనాధన్ న్యూస్: జిల్లాలో ఆగస్టు 15న నిర్వహించనున్న స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్, ఎస్పీ అశోక్ కుమార్ అధికారులను ఆదేశించారు.
గురువారం జగిత్యాల జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల ఏర్పాట్లను వారు పరిశీలించారు. ఈ సందర్భంగా వేదిక నిర్మాణం, పతాకావిష్కరణ స్థలం, సాంస్కృతిక కార్యక్రమాల ప్రాంగణం, స్టాళ్ల ఏర్పాటు, పార్కింగ్, భద్రతా చర్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.
జిల్లావ్యాప్తంగా నిర్వహించే కార్యక్రమాలకు అనుగుణంగా అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేయాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. రెవెన్యూ, పోలీస్, డీఆర్డీఏ, మున్సిపల్ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ భద్రతా ఏర్పాట్లను పటిష్టంగా చేపట్టాలని సూచించారు.
వేడుకలకు హాజరయ్యే ఆహ్వానితులు, విద్యార్థులు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తాగునీటి వసతి, వైద్య సిబ్బంది, పారిశుధ్య సదుపాయాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పతాకావిష్కరణ అనంతరం నిర్వహించే పరేడ్, శకటాల ప్రదర్శన, సాంస్కృతిక కార్యక్రమాల ఏర్పాట్లను కూడా పరిశీలించారు.
విధుల నిర్వహణలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావులేకుండా అధికారులు కట్టుదిట్టంగా పర్యవేక్షించాలని, ప్రభుత్వ గౌరవాన్ని ప్రతిబింబించేలా అన్ని ఏర్పాట్లను నాణ్యతతో పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు. జిల్లా ప్రజలంతా స్వాతంత్ర్య దినోత్సవాన్ని దేశభక్తి, జాతీయ స్ఫూర్తితో ఘనంగా జరుపుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ పరిశీలనలో అదనపు కలెక్టర్లు బి.ఎస్. లత, బి. రాజగౌడ్, డీఆర్డీఏ అధికారి రఘువరన్, డీపీఆర్వో శ్రీధర్, కలెక్టరేట్ ఏవో కిషన్, ఎమ్మార్వో రామ్మోహన్‌తో పాటు సంబంధిత జిల్లా అధికారులు, రెవెన్యూ, మున్సిపల్, డీఆర్డీఏ, పోలీస్ శాఖల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
