- ప్రభుత్వ సహకారంతో ఇందిరమ్మ ఇల్లు మంజూరు.. సొంత ఖర్చుతో ఉచితంగా నిర్మించి ఇస్తున్న సర్పంచ్

హుజురాబాద్/ధనాధన్ న్యూస్,ఆగస్టు 30: తల్లిదండ్రులను కోల్పోయి ఆర్థిక ఇబ్బందులతో ఒంటరిగా జీవిస్తున్న ఓ నిరుపేద యువకుడి సొంతింటి కలను సాకారం చేసేందుకు గ్రామ సర్పంచ్ మానవతా దృక్పథంతో ముందుకొచ్చారు. ప్రభుత్వం అందిస్తున్న ఇందిరమ్మ ఇల్లు పథకం ద్వారా ఇల్లు మంజూరు చేయించడంతో పాటు, ఇంటి నిర్మాణానికి అవసరమైన అదనపు ఖర్చులను సైతం తానే భరిస్తూ ఉచితంగా ఇల్లు నిర్మించి ఇచ్చేందుకు సర్పంచ్ ముందుకు రావడం గ్రామంలో అభినందనలు అందుకుంటున్నారు.కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలం శాలపల్లి–ఇందిరానగర్ గ్రామంలోని న్యూ ఇందిరానగర్ కాలనీకి చెందిన రౌతు తరుణ్ తల్లిదండ్రులను కోల్పోయి ఒంటరిగా జీవిస్తున్నాడు. ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో సొంతంగా ఇల్లు నిర్మించుకునే స్థోమత లేక, సొంతింటి కల ఎన్నాళ్లుగానో కలగానే మిగిలిపోయింది.తరుణ్ పరిస్థితిని గుర్తించిన గ్రామ సర్పంచ్ కోడిగుటి ప్రవీణ్ ఇందిరమ్మ ఇల్లు పథకం ద్వారా ఇల్లు మంజూరు చేయించేందుకు చొరవ చూపారు. ప్రభుత్వం నుంచి ఇల్లు మంజూరు కావడంతో, తరుణ్‌కు పూర్తిస్థాయిలో అండగా నిలవాలని నిర్ణయించుకున్న సర్పంచ్ తన సొంత నిధులతో ఇంటి నిర్మాణాన్ని పూర్తి చేసి ఉచితంగా అందించేందుకు ముందుకొచ్చారు.

ఘనంగా నిర్మాణ పనులకు శ్రీకారం
ఇందిరమ్మ ఇల్లు మంజూరు కావడంతో ఆదివారం ఇంటి నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. సర్పంచ్ కోడిగుటి ప్రవీణ్, ఉపసర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, స్థానికుల సమక్షంలో ఇంటి స్థలంలో ముగ్గు వేసి, కొబ్బరికాయ కొట్టి నిర్మాణ పనులను ప్రారంభించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ ప్రవీణ్ మాట్లాడుతూ.. అర్హులైన పేదలందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు అందేలా కృషి చేయడమే తమ లక్ష్యమన్నారు. తల్లిదండ్రులను కోల్పోయి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న తరుణ్ పరిస్థితిని గుర్తించి, అతని సొంతింటి కలను నెరవేర్చడం తన బాధ్యతగా భావించి ముందుకొచ్చినట్లు తెలిపారు. ప్రభుత్వం అందించే సహకారానికి తోడు తన సొంత ఖర్చుతో ఇంటి నిర్మాణాన్ని పూర్తి చేసి తరుణ్‌కు అందిస్తానని చెప్పారు.
‘సొంతింటి కల నెరవేరుతోంది’
ఇందిరమ్మ ఇల్లు మంజూరు కావడంతో పాటు సర్పంచ్ తన సొంత ఖర్చుతో ఇంటిని నిర్మించి ఇస్తుండటంపై రౌతు తరుణ్ ఆనందం వ్యక్తం చేశాడు. తల్లిదండ్రులు లేకపోవడంతో ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్న తనకు సొంతంగా ఇల్లు నిర్మించుకునే పరిస్థితి లేదన్నారు. ఇలాంటి సమయంలో సర్పంచ్ ప్రవీణ్ తనకు అండగా నిలిచి ప్రభుత్వం ద్వారా ఇల్లు మంజూరు చేయించడమే కాకుండా, సొంత డబ్బులతో ఇల్లు నిర్మించి ఇస్తుండటం జీవితంలో మరచిపోలేని సహాయమని పేర్కొన్నారు.
ఇల్లు మంజూరు చేయించేందుకు కృషి చేసిన సర్పంచ్ కోడిగుటి ప్రవీణ్‌తో పాటు ఉపసర్పంచ్, వార్డు సభ్యులు, పాలకవర్గ సభ్యులకు తరుణ్ కృతజ్ఞతలు తెలిపారు.
గ్రామస్థుల అభినందనలు
తల్లిదండ్రులు లేని నిరుపేద యువకుడికి ప్రభుత్వ పథకం ద్వారా ఇల్లు మంజూరు చేయించడంతో పాటు, తన సొంత నిధులతో ఇంటి నిర్మాణానికి ముందుకు వచ్చిన సర్పంచ్ ప్రవీణ్‌ను గ్రామస్థులు అభినందిస్తున్నారు. ప్రజాప్రతినిధిగా పదవిలో ఉండటమే కాకుండా, ఆపదలో ఉన్నవారికి అండగా నిలిచి వారి జీవితాల్లో మార్పు తీసుకురావడమే నిజమైన ప్రజాసేవకు నిదర్శనమని స్థానికులు పేర్కొన్నారు.తరుణ్ సొంతింటి కలను సాకారం చేసేందుకు సర్పంచ్ ప్రవీణ్ తీసుకున్న చొరవ గ్రామంలో చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వ సహకారానికి తన వంతు చేయూతను జోడించి నిరుపేద యువకుడికి ఉచితంగా ఇల్లు నిర్మించి ఇచ్చేందుకు ముందుకు రావడంపై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
