జగిత్యాల రూరల్, ధనాధన్ న్యూస్: ప్రజల భద్రత, నేరాల నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణకు నర్సింగాపూర్ గ్రామంలో 22 ప్రాంతాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. గ్రామ సర్పంచ్ కుక్కునూరు వంశీ ఆధ్వర్యంలో దాతల సహకారంతో కెమెరాలను ఏర్పాటు చేశారు. గ్రామంలోని ప్రధాన కూడళ్లు, ముఖ్యమైన ప్రాంతాలు, రహదారులను కవర్ చేసేలా సీసీ కెమెరాలను అమర్చారు.


కెమెరాల ప్రారంభ కార్యక్రమానికి జగిత్యాల డీఎస్పీ పురుషోత్తం రెడ్డి, జగిత్యాల రూరల్ సీఐ సుధాకర్, రూరల్ ఎస్సై ఉమాసాగర్ హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా పోలీసు అధికారులు మాట్లాడుతూ గ్రామాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు నేరాల నియంత్రణకు ఎంతగానో దోహదపడుతుందని తెలిపారు. అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకున్నప్పుడు నిందితులను గుర్తించడంతో పాటు దర్యాప్తులో కీలక ఆధారాలను సేకరించేందుకు కెమెరాల నిఘా ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.


ప్రజల భద్రత కోసం గ్రామస్థులు, ప్రజాప్రతినిధులు కలిసి చేపడుతున్న ఇలాంటి కార్యక్రమాలు అభినందనీయమని పోలీసు అధికారులు అన్నారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్, పాలకవర్గ సభ్యులు, దాతలు, గ్రామ పెద్దలు, యువత, గ్రామస్థులు పాల్గొన్నారు. సీసీ కెమెరాల ఏర్పాటుకు సహకరించిన దాతలకు సర్పంచ్ కుక్కునూరు వంశీ కృతజ్ఞతలు తెలిపారు.

Leave a Reply