హనుమకొండ కలెక్టరేట్, ధనాధన్ న్యూస్: స్వయం సహాయక మహిళా సంఘాలను అడ్డుపెట్టుకుని అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారంటూ హనుమకొండ జిల్లా నడికూడ మండలం ముస్త్యాలపల్లి గ్రామానికి చెందిన మహిళా సంఘ సభ్యురాలు జిల్లా కలెక్టర్ గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేశారు. లింకేజీ, శ్రీనిధి రుణాల పేరుతో నిబంధనలకు విరుద్ధంగా డబ్బులు వసూలు చేస్తూ, మహిళలను వేధిస్తున్నారని ఆరోపించారు. వివరాల్లోకి వెళ్తే.. ముస్త్యాలపల్లి గ్రామంలోని ఇంద్ర మహిళా సంఘం సభ్యురాలు దోమ సునీత, జిల్లా డీఆర్డీఏ అధికారి మేక శ్రీనివాస్‌కు ఈ మేరకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. గ్రామంలోని సీఏ బొట్ల విమల తమను తీవ్రంగా వేధిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. గ్రామంలో మొత్తం 25 మహిళా సంఘాల గ్రూపులు ఉండగా, ఒక్కో గ్రూపులోని మహిళలను లక్ష్యంగా చేసుకుని బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. రుణాల వసూళ్ల విషయంలో నిబంధనలు పాటించడం లేదని, గడువు ముగియకముందే డబ్బులు చెల్లించాలని ఒత్తిడి తెస్తూ అదనపు వడ్డీ భారం మోపుతున్నారని సునీత తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేకాకుండా, ప్రతి మహిళ నుంచి అదనంగా రూ.1,000 ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారని ఆరోపించారు. డబ్బులు ఇవ్వకపోతే తన అనుచరులతో దాడులు చేయిస్తానంటూ బెదిరిస్తున్నారని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.

*విచారణ జరిపిస్తామని అధికారుల హామీ*

బాధితురాలి ఫిర్యాదుపై డీఆర్డీఏ అధికారి మేక శ్రీనివాస్ స్పందించినట్లు సమాచారం. సంబంధిత అధికారులతో విచారణ జరిపిస్తామని, ఆరోపణలు నిజమని తేలితే సీఏ బొట్ల విమలను విధుల నుంచి తొలగించే చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు తెలిసింది.

*మహిళా సంఘాల సభ్యుల్లో ఆందోళన*

మహిళల ఆర్థిక స్వావలంబన, సాధికారత కోసం ప్రభుత్వం అందిస్తున్న రుణ సౌకర్యాల విషయంలో అక్రమాలు జరుగుతున్నాయన్న ఆరోపణలు స్థానికంగా చర్చనీయాంశంగా మారాయి. మహిళా సంఘాల పేరుతో అదనపు వసూళ్లకు పాల్పడుతున్నారన్న ఫిర్యాదుపై అధికారులు సమగ్ర విచారణ జరిపి, వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని బాధితులు కోరుతున్నారు.

Leave a Reply