నడికూడ, ధనాధన్ న్యూస్: నడికూడ మండలం చర్లపల్లి గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో 2026–27 విద్యా సంవత్సరం నుంచి ప్రీ ప్రైమరీ విద్యను ప్రారంభించారు. ఇందులో భాగంగా ప్రీ ప్రైమరీలో చేరిన చిన్నారులకు పాఠశాల ఆధ్వర్యంలో వర్క్‌బుక్స్‌ను పంపిణీ చేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన గ్రామ సర్పంచ్ బండి రేణుక శంకర్ ముదిరాజ్ చిన్నారులకు వర్క్‌బుక్స్ అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చిన్నారుల విద్యాభ్యాసానికి ప్రీ ప్రైమరీ విద్య ఎంతో ఉపయోగకరమన్నారు. చిన్న వయసులోనే పిల్లల్లో చదువుపై ఆసక్తి, సృజనాత్మకత, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేందుకు ప్రీ ప్రైమరీ విద్య దోహదపడుతుందని తెలిపారు.


ఆటలు, పాటలు, కథలు, చిత్రలేఖనం, రంగులు, అంకెలు తదితర కార్యకలాపాల ద్వారా పిల్లలకు ఆనందదాయకమైన వాతావరణంలో విద్యను అందించడం అభినందనీయమన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి, అందుబాటులో ఉన్న విద్యా అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.పాఠశాల ప్రధానోపాధ్యాయులు అచ్చ సుదర్శన్ మాట్లాడుతూ ప్రీ ప్రైమరీ విద్య ద్వారా చిన్నారులకు ప్రాథమిక విద్యకు బలమైన పునాది ఏర్పడుతుందని తెలిపారు. పిల్లల వయస్సుకు అనుగుణంగా ఆటపాటలు, కథలు, రైమ్స్, డ్రాయింగ్, క్రాఫ్ట్, రంగులు, ఆకారాలు, సంఖ్యలు తదితర అంశాలను సరదాగా నేర్పిస్తున్నామని చెప్పారు. వర్క్‌బుక్స్ ద్వారా పిల్లల్లో రాయడం, గుర్తించడం, ఆలోచించడం వంటి ప్రాథమిక నైపుణ్యాలు అభివృద్ధి చెందుతాయని పేర్కొన్నారు.


‘మన ఊరి బడి–మన పిల్లల భవిష్యత్తు’ అనే ఆలోచనతో ప్రభుత్వ పాఠశాలలో చిన్నారులకు నాణ్యమైన విద్యను అందించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. తల్లిదండ్రులు ప్రీ ప్రైమరీ విద్యపై అవగాహన పెంచుకుని తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని కోరారు.కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు లకావత్ దేవా, కంచ రాజు కుమార్, ప్రీ ప్రైమరీ టీచర్ బండి శ్వేత, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply