
జమ్మికుంట/ధనాధన్ న్యూస్: మెప్మా ఆధ్వర్యంలో స్థానిక వినాయక గార్డెన్‌లో గురువారం ‘ఉద్యమ్ రిజిస్ట్రేషన్’పై ప్రత్యేక అవగాహన శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ మహమ్మద్ అయాజ్ ఆధ్వర్యంలో, టీఎల్ఎఫ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి కరీంనగర్ పీడీ స్వరూప రాణి, మున్సిపల్ చైర్‌పర్సన్ మొలుగు ప్రశాంత్ కుమార్ (దిలీప్) ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల (MSME) మంత్రిత్వ శాఖ నిబంధనల ప్రకారం వ్యాపార సంస్థలను పెట్టుబడి, వార్షిక టర్నోవర్ ఆధారంగా వర్గీకరిస్తారని తెలిపారు. వ్యాపార లావాదేవీలు సులభతరం కావడంతో పాటు ప్రభుత్వ పథకాల లబ్ధి పొందేందుకు ప్రతి చిన్న, మధ్య తరహా వ్యాపార సంస్థ ఉద్యమ్ రిజిస్ట్రేషన్ ద్వారా శాశ్వత గుర్తింపు పొందాల్సిన అవసరం ఉందని సూచించారు.
ఈ రిజిస్ట్రేషన్ ద్వారా కలిగే ప్రయోజనాలను వివరించి, చిరు వ్యాపారులు దీనిని వినియోగించుకోవాలని కోరారు. వ్యాపార రంగంలో పారదర్శకత పెంపొందించడంతో పాటు ప్రభుత్వ సహాయం పొందాలంటే ఉద్యమ్ పోర్టల్‌లో తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో డీఎంసీ శ్రీవాణి, డీపీఎం సతీష్, ఇంచార్జి టీఎంసీ మల్లీశ్వరి, సీఎల్ఆర్పీలు మంజుల, జ్యోతి, ఆర్పీలు, ఓబీలు తదితరులు పాల్గొన్నారు.