- షెడ్బ్యాక్ లేకుండానే పనులు.. 63వ జాతీయ రహదారి పక్కనే అక్రమ కట్టడం?
- మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేసినా చర్యలు శూన్యం
- జిల్లా కలెక్టర్ ప్రజావాణిలో మరోసారి ఫిర్యాదు

మెట్పల్లి/ధనాధన్ న్యూస్,జూన్ 8: జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని 63వ జాతీయ రహదారిని ఆనుకుని నిబంధనలకు విరుద్ధంగా బ్యాంకెట్ హాల్ నిర్మాణం జరుగుతోందని ఆరోపిస్తూ, సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని వంకాయల ముఖేష్ చంద్ర జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఆయన వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ, జాతీయ రహదారి పక్కనే ఎలాంటి షెడ్బ్యాక్ లేకుండా బ్యాంకెట్ హాల్ నిర్మాణ పనులు చేపడుతున్నారని తెలిపారు. నిర్మాణ స్థలం పక్కగా, పైభాగంలో విద్యుత్ ప్రధాన లైన్లు కూడా ఉన్నాయని పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రోడ్డు ప్రమాదాలు, విద్యుత్ ప్రమాదాలు లేదా అగ్నిప్రమాదాలు సంభవించినట్లయితే సహాయక చర్యలు చేపట్టడం కష్టసాధ్యమవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ విషయమై గత ఏప్రిల్ 30న మెట్పల్లి మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆయన ఆరోపించారు. రాజకీయ ప్రముఖులకు చెందిన నిర్మాణం కావడంతో అధికారులు చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని విమర్శించారు.
జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకుని మెట్పల్లి మున్సిపల్ అధికారులకు తగిన ఆదేశాలు జారీ చేసి, చట్ట ప్రకారం విచారణ జరిపి అవసరమైన చర్యలు తీసుకోవాలని వంకాయల ముఖేష్ చంద్ర విజ్ఞప్తి చేశారు.