జమ్మికుంట,జూలై 3(ధనాధన్ న్యూస్: జమ్మికుంట పట్టణంలోని విద్యోదయ హైస్కూల్‌లో బాస్ (BAS) స్కీమ్ కింద చదువుతున్న విద్యార్థులను పాఠశాలలో కొనసాగించకుండా యాజమాన్యం ఇబ్బందులకు గురిచేస్తోందని పలువురు తల్లిదండ్రులు మండల విద్యాధికారికి వినతిపత్రం సమర్పించారు.

తల్లిదండ్రుల కథనం ప్రకారం, ఈ విద్యా సంవత్సరంలో బాస్ స్కీమ్‌కు సంబంధించిన నిధులు ప్రభుత్వం నుంచి అందలేదని పేర్కొంటూ, విద్యార్థులను కొనసాగించాలంటే ఫీజులు చెల్లించాలని పాఠశాల యాజమాన్యం ఒత్తిడి చేస్తోందని ఆరోపించారు. ఫీజులు చెల్లించకపోతే తమ పిల్లలను వేరే పాఠశాలలో చేర్పించుకోవాలని సూచిస్తున్నారని తెలిపారు.

బాస్ స్కీమ్ ద్వారా ఎక్కువగా మధ్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారని, పాఠశాలలు ప్రారంభమై 15 రోజులు గడిచినా తమ పిల్లలను తరగతులకు అనుమతించకపోవడం వల్ల వారి విద్యకు అంతరాయం కలుగుతోందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు.

ఇప్పటికే అదే పాఠశాలలో చదువుతున్న పిల్లలను మరో పాఠశాలకు మార్చడం వల్ల వారి చదువుపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ అంశంపై మండల విద్యాధికారి వెంటనే విచారణ జరిపించి, విద్యార్థులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు.సమస్యను త్వరితగతిన పరిష్కరించకపోతే పాఠశాల ఎదుట ఆందోళన చేపట్టాల్సి వస్తుందని తల్లిదండ్రులు హెచ్చరించారు.

Leave a Reply