హుజురాబాద్ డివిజన్‌లో చీటింగ్ కేసులపై సీపీ సమీక్ష

  • బాధితులకు సత్వర న్యాయం – సాంకేతిక ఆధారాలతో విచారణ వేగవంతం చేయాలి: సీపీ గౌష్ ఆలం

కరీంనగర్/ధనాధన్ న్యూస్, ఏప్రిల్ 29:
కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం బుధవారం హుజురాబాద్ ఏసీపీ కార్యాలయంలో డివిజన్ స్థాయి పోలీసు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డివిజన్ పరిధిలోని పోలీస్ స్టేషన్లలో పెండింగ్‌లో ఉన్న నేరాల విచారణ తీరును సమగ్రంగా పరిశీలించారు.


ముఖ్యంగా చీటింగ్ (మోసం) మరియు ఫోర్జరీ కేసులపై ప్రత్యేక దృష్టి సారించిన సీపీ, అమాయక ప్రజలను మోసం చేసే నేరస్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న కేసులను త్వరితగతిన పూర్తి చేసి బాధితులకు న్యాయం అందించాలని సూచించారు.


ప్రస్తుత కాలంలో నేరస్తులు కొత్త పద్ధతుల్లో మోసాలకు పాల్పడుతున్న నేపథ్యంలో, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, ఫోరెన్సిక్ ఆధారాలను విస్తృతంగా వినియోగించి విచారణ వేగవంతం చేయాలని తెలిపారు. కోర్టులో నేరస్తులకు శిక్ష పడేలా పటిష్టమైన సాక్ష్యాధారాలతో నిర్ణీత గడువులోగా ఛార్జ్ షీట్లు దాఖలు చేయాలని అధికారులను ఆదేశించారు.


నేరాల నియంత్రణతో పాటు ప్రజలకు అందుబాటులో ఉంటూ పోలీసులపై నమ్మకం పెంపొందించే విధంగా విధులు నిర్వర్తించాలని సీపీ స్పష్టం చేశారు.ఈ సమావేశంలో హుజురాబాద్ ఏసీపీ వి. మాధవి, ఇన్స్పెక్టర్లు కరుణాకర్, శ్రీనివాస్, రామకృష్ణ, ఎస్సైలు ఆవుల తిరుపతి, స్వాతి, క్రాంతి తదితరులు పాల్గొన్నారు.

Leave a comment