- ఘటన స్థలాన్ని సందర్శించిన మున్సిపల్ చైర్‌పర్సన్ సమీండ్ల వాణి శ్రీనివాస్

జగిత్యాల/ధనాధన్ న్యూస్,జూన్ 12:
జగిత్యాల పట్టణంలోని మోచి బజార్ ప్రాంతంలో శుక్రవారం షార్ట్ సర్క్యూట్ కారణంగా ఓ ఇంటిలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఇంటిలో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో స్థానికులు వెంటనే అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజన్‌తో ఘటన స్థలానికి చేరుకుని సకాలంలో స్పందించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ప్రమాదంలో ఇంటిలోని కొంత సామగ్రి దగ్ధమైనట్లు తెలిసింది. అయితే ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని సమాచారం.
అగ్ని ప్రమాదం విషయం తెలుసుకున్న జగిత్యాల మున్సిపల్ చైర్‌పర్సన్ సమీండ్ల వాణి శ్రీనివాస్ ఘటన స్థలాన్ని సందర్శించి పరిస్థితిని పరిశీలించారు. బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. అనంతరం సంబంధిత అధికారులతో మాట్లాడి అవసరమైన సహాయ చర్యలు చేపట్టాలని సూచించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజలు విద్యుత్ పరికరాలు, ఇంటి వైరింగ్ విషయంలో అప్రమత్తంగా ఉండాలని, షార్ట్ సర్క్యూట్‌లను నివారించేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అగ్నిమాపక సిబ్బంది సకాలంలో స్పందించి మంటలను అదుపులోకి తీసుకురావడాన్ని ఆమె అభినందించారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సత్య ప్రణవ్, అడువాల జ్యోతి లక్ష్మణ్, కూతురు శేఖర్, సిరిపురం శ్రీలత శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.