- కాటారం మండలంలో జనజీవనానికి అంతరాయం

కాటారం,జూలై 30(ధనాధన్ న్యూస్): కాటారం మండలంలో గత మూడు రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తమైంది. పలుచోట్ల లోతట్టు ప్రాంతాలు జలమయమవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
అయితే, ఈ వర్షాలతో వరి పొలాలు నీటితో నిండిపోవడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మండలంలోని చెరువులు, కుంటలు, వాగులు క్రమంగా నిండుతుండటంతో భూగర్భ జలాలు పెరిగే అవకాశాలు ఉన్నాయని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
నిరంతర వర్షాల కారణంగా వాతావరణం పూర్తిగా చల్లబడింది. లోతట్టు ప్రాంతాల్లో నీరు నిల్వ ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. అవసరం లేనప్పుడు బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు పాటించాలని, వాగులు, వంకలు దాటే ప్రయత్నం చేయవద్దని హెచ్చరించారు.వాతావరణ శాఖ అంచనాల ప్రకారం మరో రెండు నుంచి మూడు రోజుల పాటు వర్షాలు కొనసాగే అవకాశం ఉన్నందున ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.

