
వావిలాల: గ్రామానికి చెందిన రాగల సాంబయ్య (55) అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందడం స్థానికంగా కలకలం రేపింది. కుటుంబ సభ్యుల సమాచారం మేరకు, ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
సాంబయ్యకు ఇద్దరు కుమారులు ఉండగా, చిన్న కుమారుడు రాగల వంశీ (26) హైదరాబాద్‌లో స్వంత కారును అద్దెకు నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఏడాది క్రితం అతని తల్లి అనారోగ్యంతో మృతి చెందగా, అప్పటి నుంచి సాంబయ్య తన పెద్ద కుమారుడు నాగరాజుతో కలిసి వావిలాల గ్రామంలో నివసిస్తున్నాడు.
గురువారం (ఏప్రిల్ 30) ఉదయం సుమారు 11 గంటల సమయంలో నాగరాజు, తన తండ్రి ఇంటి ముందున్న షెడ్డులో అపస్మారక స్థితిలో పడి ఉన్నాడని వంశీకి ఫోన్ ద్వారా సమాచారం అందించాడు. వెంటనే గ్రామానికి చేరుకున్న వంశీ, తన తండ్రి మృతదేహాన్ని అక్కడే గుర్తించాడు. మృతదేహం వద్ద ముక్కు నుంచి రక్తం కారిన ఆనవాళ్లు కనిపించినట్లు సమాచారం.
స్థానికుల ప్రకారం, సాంబయ్యను బుధవారం (ఏప్రిల్ 29) ఉదయం చివరిసారిగా గ్రామంలో కనిపించినట్లు తెలిపారు. అయితే ఆయన మృతి కారణాలు తెలియకపోవడంతో కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ఈ మేరకు పోలీసులు అనుమానాస్పద మృతి కేసుగా నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఘటనపై అన్ని కోణాల్లో విచారణ కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.