జమ్మికుంటలో గణేష్ నవరాత్రి ఉత్సవాల ఏర్పాట్లపై అధికారుల సూచనలు

By dhanadhannews.com

  • మండపాల వద్ద లైసెన్స్ పొందిన ఎలక్ట్రీషియన్ల ద్వారానే వైరింగ్ చేయాలి
  • డీజేల వాడకాన్ని నివారించి పండుగను శాంతియుతంగా జరుపుకుందాం

జమ్మికుంట,ధనాధన్ న్యూస్ ఆగస్టు 26:
రేపటి నుంచి ప్రారంభమయ్యే గణేష్ నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని జమ్మికుంట పట్టణంలో అధికారులు ప్రత్యేక సూచనలు జారీ చేశారు. ఈ రోజు జమ్మికుంట టౌన్ ఇన్స్పెక్టర్ ఎస్. రామకృష్ణ, మండల తహసీల్దార్ (ఎం.ఆర్.వో), మున్సిపాలిటీ సిబ్బంది,ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అధికారులు సమావేశమై ఉత్సవాల ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా టౌన్ ఇన్స్పెక్టర్ మాట్లాడుతూ గణేష్ మండపాల వద్ద విద్యుత్ వైరింగ్‌ను తప్పనిసరిగా లైసెన్స్ పొందిన ఎలక్ట్రీషియన్ ద్వారానే చేయాలని స్పష్టం చేశారు. వైరింగ్‌లో ఎక్కడా జాయింట్లు లేకుండా చూసుకోవాలని, విద్యుత్ వైర్లను ఇనుప పైపులకు తగిలించరాదని, వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని విద్యుత్ వైర్లు నేలమీద పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

అలాగే వినాయకుల ప్రతిష్ట, నిమజ్జనం సమయాల్లో ప్రజలకు ఇబ్బందులు కలిగించే విధంగా డీజే సౌండ్ సిస్టమ్స్ వాడకూడదని హెచ్చరించారు. పండుగలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు, నిర్వాహకులు, భక్తులు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

గణేష్ నవరాత్రి ఉత్సవాలను అందరూ సంతోషంగా, శాంతియుతంగా జరుపుకోవాలని ఇన్స్పెక్టర్ ఎస్. రామకృష్ణ పిలుపునిచ్చారు.