- బీజేపీ సీనియర్ నాయకులు మట్ట పవన్ రెడ్డి

ఇల్లందకుంట,ధనాధన్ న్యూస్: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఇచ్చిన 420 హామీలలో భాగంగా వృద్ధాప్య, బీడీ కార్మికుల పెన్షన్లను కూడా వెంటనే అమలు చేయాలని ఇల్లందకుంట మండల బీజేపీ సీనియర్ నాయకులు మట్ట పవన్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.గురువారం ఆయన ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు.కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో గత ప్రభుత్వం అందిస్తున్న వివిధ రకాల పెన్షన్లను పెంచి ఇస్తామని హామీ ఇచ్చిందని, కానీ రెండున్నరేళ్లు గడిచినా పెన్షన్ల పెంపుపై స్పష్టమైన నిర్ణయం తీసుకోకుండా ప్రజలను మభ్యపెడుతోందని పవన్ రెడ్డి విమర్శించారు. ముఖ్యంగా వృద్ధాప్య, బీడీ కార్మికుల పెన్షన్ల విషయంలో ప్రభుత్వం స్పష్టత ఇవ్వకపోవడం తీవ్ర అన్యాయమని అన్నారు.ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ల కోసం దరఖాస్తులు చేసుకోవచ్చని ప్రకటించిన నేపథ్యంలో మీ-సేవ కేంద్రాలకు వెళ్లిన వృద్ధులు, బీడీ కార్మికులకు సంబంధించి దరఖాస్తు చేసుకునే ఆప్షన్ సైట్లో కనిపించడం లేదని తెలిపారు. ప్రభుత్వం జారీ చేసిన సర్క్యులర్లో కూడా వృద్ధాప్య, బీడీ కార్మికుల వివరాల నమోదు కోసం ప్రత్యేకంగా ఎలాంటి కాలమ్ లేకపోవడం అనుమానాలకు తావిస్తోందన్నారు.వృద్ధాప్య, బీడీ కార్మికుల పెన్షన్లకు దరఖాస్తులు స్వీకరిస్తున్నారా? లేదా? సైట్లో ఆప్షన్ కనిపించకపోవడానికి ఏమైనా సాంకేతిక సమస్య ఉందా? అనే విషయాలపై ప్రభుత్వం వెంటనే స్పష్టత ఇవ్వాలని మట్ట పవన్ రెడ్డి డిమాండ్ చేశారు.అలాగే ఆగస్టు 15 నుంచి పెన్షన్లను పెంచి ఇస్తామని ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో, వృద్ధులు, బీడీ కార్మికులకు కూడా పెంచిన పెన్షన్ను అందించాలని కోరారు. హామీలను కేవలం ప్రకటనలకే పరిమితం చేయకుండా, అర్హులైన ప్రతి ఒక్కరికీ పెన్షన్ అందేలా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
