జమ్మికుంట/ధనాధన్ న్యూస్, సెప్టెంబర్ 4:
జాతీయ నేత్రదాన పక్షోత్సవాల సందర్భంగా అవయవదానం పై అవగాహన కల్పించేందుకు సదాశయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జమ్మికుంట పట్టణంలోని కార్తికేయ ఐటీఐ కళాశాలలో ప్రత్యేక సదస్సు జరిగింది.
ఈ కార్యక్రమంలో చైర్మన్ లెంకలపల్లి శరత్, ఫౌండేషన్ జిల్లా అధ్యక్షులు నరహరి గురూజీ పాల్గొని విద్యార్థులకు అవయవదానం యొక్క ప్రాముఖ్యతను వివరించారు. మరణం తర్వాత శరీరం కాలిపోతే బూడిద, పూడితే మట్టిగా మారిపోతుందని, అదే అవయవాలను దానం చేస్తే మరొకరి జీవితానికి పునర్జన్మ కల్పించగలమని వారు గుర్తుచేశారు.
యూత్ కాంగ్రెస్ జమ్మికుంట మండల అధ్యక్షులు బుడిగె శ్రీకాంత్ మాట్లాడుతూ, “ఒకరి అవయవదానం ఒక కుటుంబాన్ని నిలబెడుతుంది. మరణం తర్వాత కూడా మనం ఇతరుల రూపంలో జీవించే అవకాశం అవయవదానం ద్వారా వస్తుంది” అని అన్నారు. నేత్రదానం చేయడం ద్వారా చూపులేని వారి జీవితాల్లో వెలుగులు నింపగలమని, ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని కోరారు.
ఈ సందర్భంగా పలువురు తమ కళ్ళను దానం చేస్తామని ప్రకటించారు. ఫౌండేషన్ సభ్యులు గర్రెపల్లి వెంకటేశ్వర్లు, వంగల రమేష్, యాంసాని సందీప్, కళాశాల అధ్యాపక బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.
