- కొనుగోలు కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్న అన్నదాతలు.. వర్షాలు పడితే ధాన్యం పరిస్థితి ఏమిటని ఆవేదన

సైదాపూర్ (ధనాధన్ న్యూస్): కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని పలు గ్రామాల్లో ఇప్పటివరకు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కష్టపడి పండించిన వరి ధాన్యాన్ని కోతలు కోసి కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చినా కొనుగోళ్లు ప్రారంభించకపోవడంతో రైతులు అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని ఆరబెట్టుకునేందుకు సరైన వసతులు లేకపోవడం రైతులను మరింత ఆందోళనకు గురిచేస్తోంది. ధాన్యం ఆరబెట్టేందుకు అవసరమైన కల్లాలు, ఇతర సౌకర్యాలు లేకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తుండటంతో రైతుల్లో ఆందోళన నెలకొంది. వర్షం కురిసి కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన ధాన్యం తడిసిపోతే ఎవరు బాధ్యత వహిస్తారని రైతులు ప్రశ్నిస్తున్నారు.
సైదాపూర్ మండలంలో మొత్తం 25 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉన్నాయని రైతులు తెలిపారు. వీటిలో వెన్నంపల్లి సహకార పరపతి సంఘం పరిధిలో 13, మరో సహకార పరపతి సంఘం పరిధిలో 4, ఐకేపీ ఆధ్వర్యంలో 9 కొనుగోలు కేంద్రాలు ఉన్నాయని పేర్కొన్నారు. అయితే ఇప్పటివరకు ఒక్క కేంద్రంలో కూడా కొనుగోళ్లు ప్రారంభం కాలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.అధికారులు వెంటనే స్పందించి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని, రైతులకు ధాన్యం ఆరబెట్టుకునేందుకు అవసరమైన వసతులు కల్పించాలని మండల రైతులు కోరుతున్నారు.
