- వేతనం చెల్లింపులపై అనుమానాలు.. విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ప్రజావాణిలో ఫిర్యాదు

కాటారం, ధనాధన్ న్యూస్: ప్రభుత్వ పాఠశాలలో విధులు నిర్వహించాల్సిన ఉపాధ్యాయుడు మరోచోట పనిచేస్తున్నప్పటికీ, అధికారిక డిప్యూటేషన్ ఉత్తర్వులు లేకుండానే వేతనం పొందుతున్నారనే ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపించాలని కుల ప్రజా సంఘాల జేఏసీ జిల్లా చైర్మన్ పీక కిరణ్ మౌర్య, ఐతే బాపు డిమాండ్ చేశారు.ఈ మేరకు సోమవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అధికారులకు వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా పీక కిరణ్ మౌర్య మాట్లాడుతూ.. కాటారం మండలం రఘుపల్లి ప్రభుత్వ పాఠశాలకు సంబంధించిన ఉపాధ్యాయుడు గత నెల రోజులుగా మరోచోట విధులు నిర్వహిస్తున్నప్పటికీ, డిప్యూటేషన్‌కు సంబంధించి అధికారిక ఉత్తర్వులు ఉన్నాయా? అనే అంశంపై స్పష్టత అవసరమని పేర్కొన్నారు. మరోచోట విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయుడికి రఘుపల్లి పాఠశాల నుంచి వేతనం చెల్లిస్తున్నారనే ఆరోపణలపై అధికారులు దృష్టి సారించాలని కోరారు.ఈ వ్యవహారంలో సంబంధిత కాంప్లెక్స్ హెచ్ఎం పాత్రపైనా సమగ్ర విచారణ చేపట్టాలని, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినట్లు తేలితే బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో విధుల నిర్వహణ, వేతనాల చెల్లింపుల్లో పారదర్శకత ఉండాలని, ప్రజాధనం దుర్వినియోగం కాకుండా సంబంధిత అధికారులు తక్షణమే స్పందించాలని విజ్ఞప్తి చేశారు.
