- కార్యాలయ ఆవరణలో మద్యం సీసాలు.. పట్టించుకోని అధికారుల తీరుపై గ్రామస్థుల ఆగ్రహం

సైదాపూర్, ధనాధన్ న్యూస్: సైదాపూర్ మండలంలోని సైదాపూర్ గ్రామపంచాయతీ కార్యాలయం మద్యం సేవించే వారికి అడ్డాగా మారుతోందని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామపంచాయతీ కార్యాలయానికి సమీపంలోనే వైన్స్ షాప్ ఉండటంతో కొందరు మందుబాబులు అక్కడ మద్యం కొనుగోలు చేసి, సాయంత్రం వేళల్లో గ్రామపంచాయతీ కార్యాలయ ఆవరణలోకి వచ్చి మద్యం సేవిస్తున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు.ప్రజా సమస్యల పరిష్కారానికి, గ్రామ అభివృద్ధి పనుల నిర్వహణకు కేంద్రంగా ఉండాల్సిన గ్రామపంచాయతీ కార్యాలయ ప్రాంగణంలో మద్యం సీసాలు కనిపించడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వ కార్యాలయ ఆవరణలో ఇలాంటి పరిస్థితులు నెలకొనడంపై పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
గ్రామపంచాయతీ కార్యాలయ ఆవరణలో జరుగుతున్న ఈ వ్యవహారాన్ని అరికట్టడంలో సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని గ్రామస్థులు ప్రశ్నిస్తున్నారు. కార్యాలయ పరిసరాలనే సక్రమంగా నిర్వహించలేకపోతే గ్రామంలోని ఇతర సమస్యలను ఎలా పరిష్కరిస్తారంటూ సర్పంచిపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.ఇప్పటికైనా సర్పంచి, సంబంధిత అధికారులు స్పందించి గ్రామపంచాయతీ కార్యాలయ ఆవరణలో మద్యం సేవించే వారిపై తగిన చర్యలు తీసుకోవాలని, కార్యాలయ పరిసరాల్లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పటిష్టమైన చర్యలు చేపట్టాలని సైదాపూర్ గ్రామస్థులు కోరుతున్నారు.
