సిరిసేడు గ్రామంలో ప్రత్యేక గ్రామసభ… ప్రభుత్వ పథకాలపై అవగాహన

  • 100 రోజుల పాలనలో సైడ్ డ్రైనేజీ, బస్టాండ్, మరుగుదొడ్ల నిర్మాణం
  • రానున్న రోజుల్లో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం

ఇల్లందకుంట/ధనాధన్ న్యూస్:
ఇల్లందకుంట మండలం సిరిసేడు గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా గురువారం ప్రత్యేక గ్రామసభ నిర్వహించారు. గ్రామ పంచాయతీ ఆవరణలో సర్పంచ్ రేణికుంట్ల శ్యామల-కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.కార్యక్రమం ప్రారంభంలో తెలంగాణ రాష్ట్ర గీతం ‘జయ జయహే తెలంగాణ’ను ఆలపించారు. అనంతరం ముఖ్యమంత్రి సందేశాన్ని గ్రామస్తులకు ప్రదర్శించారు. వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు హాజరై తమ శాఖలకు సంబంధించిన పథకాలు, కార్యక్రమాలపై వివరాలు వెల్లడించారు.


ఈ సందర్భంగా సర్పంచ్ రేణికుంట్ల శ్యామల-కుమార్ మాట్లాడుతూ, ఇందిరమ్మ ఇండ్లు, డబుల్ బెడ్రూం గృహాలు, గృహజ్యోతి, చేయూత పింఛన్లు, మహాలక్ష్మీ పథకం కింద గ్యాస్ సిలిండర్ సబ్సీడి వంటి పథకాలపై అవగాహన కల్పించినట్లు తెలిపారు. తడి-పాడి చెత్త వేరు చేయడం, పరిసరాల పరిశుభ్రత, ప్లాస్టిక్ నిర్మూలనపై గ్రామస్తులకు సూచనలు ఇచ్చారు. వేసవి నేపథ్యంలో మంచినీటి వృథాను నివారించాలన్నారు.


100 రోజుల పాలనలో సైడ్ డ్రైనేజీ, బస్టాండ్, వాష్ రూమ్స్ నిర్మాణం


సర్పంచిగా బాధ్యతలు చేపట్టిన 100 రోజుల వ్యవధిలో గ్రామ అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు శ్యామల తెలిపారు. ఎస్సీ కాలనీలో గత 25 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న సైడ్ డ్రైనేజీ సమస్యను పరిష్కరించామని పేర్కొన్నారు. ప్రాథమిక పాఠశాలకు ప్రహరీ గోడ నిర్మాణం పూర్తి చేసినట్లు తెలిపారు.
గ్రామ ప్రజల సౌకర్యార్థం, ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా గన్ను సంపత్ సహకారంతో బస్టాండ్ నిర్మాణం చేపడుతున్నట్లు చెప్పారు. వారసంతకు వచ్చే మహిళల అవసరాలను దృష్టిలో ఉంచుకుని బస్టాండ్ వద్ద మరుగుదొడ్లు ఏర్పాటు చేసినట్లు వివరించారు. రానున్న రోజుల్లో గ్రామంలో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
ఇకపై గ్రామ అభివృద్ధి పనులను మరింత వేగవంతం చేస్తూ, అర్హులైన ప్రతి నిరుపేదకు ప్రభుత్వ పథకాలు పారదర్శకంగా అందేలా కృషి చేస్తామని సర్పంచ్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి శ్రీనివాస్, వార్డు సభ్యులు రెడ్డి సారంగం, అమ్మగోని రమేష్, వరలక్ష్మి, కాశమల శ్రీలేఖతో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Leave a comment