ప్రోటోకాల్ పాటించని అధికారులపై చర్యలు తీసుకోండి

By dhanadhannews.com

  • కవ్వంపల్లి సత్యనారాయణ ఫోటోను విస్మరించడం బాధాకరం
  • ప్రోటోకాల్ పాటించకపోవడం దళితుల ఆత్మగౌరవానికి భంగం కలిగించడమే
  • జిల్లా గ్రంధాలయ చైర్మన్ సత్తు మల్లేష్, కాంగ్రెస్ ఎస్సీ సెల్ అధ్యక్షులు కొరివి అరుణ్ కుమార్
  • కలెక్టర్ కు ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ నాయకులు

కరీంనగర్/ధనాధన్ న్యూస్: ప్రభుత్వ కార్యక్రమాలలో ప్రోటోకాల్ పాటించని అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా గ్రంథాలయ చైర్మన్ సత్తు మల్లేష్ , జిల్లా కాంగ్రెస్ ఎస్సీ సెల్ అధ్యక్షులు కొరివి అరుణ్ కుమార్ కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సర్పంచ్ కి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిన్న కరీంనగర్ సి.ఎస్.ఐ ప్రాంగణంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో నిర్వహించబడ్డాయని,ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు,నగర ప్రతినిధులను కలుపుకొని సంబంధిత అధికారులు కార్యక్రమాన్ని సమన్వయం చేసే ప్రయత్నం చేశారు.కాని ఈ కార్యక్రమానికి సంబంధించి విడుదలైన ఫోటోలు మరియు సమాచారంలో మానకొండూర్ ఎమ్మెల్యే డా.కవ్వంపల్లి సత్యనారాయణ ఫోటోను మరియు వారు పాల్గొనడాన్ని పూర్తిగా విస్మరించారని అన్నారు.

ఇలా జరగడం ఇదే మొదటిసారి కాదని ఇటీవల జరిగిన సన్న బియ్యం పంపిణీ కార్యక్రమంలో (7వ వార్డు) వారి నియోజకవర్గం  పరిధి అయినప్పటికీ కార్యక్రమం అంశాలు అధికారిక ఫోటోలు, సమాచారంలో పొందుపరచలేదని ఆయన గుర్తు చేశారు.
ఇలా పునరావృతంగా ఒక ఉన్నత విద్యావంతుడు,అత్యంత గౌరవప్రదమైన వృత్తిలో ఉన్న,ఒక దళిత ప్రజాప్రతినిదిని విస్మరించడం వల్ల ప్రజల్లో అయోమయం ఏర్పడుతోందని,అధికార యంత్రాంగం ఉద్దేశపూర్వకంగా సామాజిక అంశాలను పరిగణలోకి తీసుకొని  ఇలా వ్యవహరిస్తుందా అనే సందేహాలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయని అన్నారు.ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలచే ఎన్నుకోబడిన ప్రతినిధులకు తగిన గౌరవం, గుర్తింపు ఇవ్వడం అత్యంత అవసరం అని, భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా జిల్లా కలెక్టర్ తగు చర్యలు తీసుకోవాలని, దీనికి బాధ్యులైన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఇది ఇలాగే కొనసాగితే రాబోయే రోజుల్లో దళితుల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదుర్కోవలసి వస్తుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మామిడి అనిల్, జీడి రమేష్, సముద్రాల లక్ష్మణ్, జుంజుపల్లి వివేక్, గొట్టే బాబు, కనకం విద్యాసాగర్,  యూత్ కాంగ్రెస్ నాయకులు మణికంఠ, తదితరులు పాల్గొన్నారు.