ఉపాధ్యాయులు విద్యార్థులకు మార్గదర్శకులు

By dhanadhannews.com

  • జిల్లా విద్యాధికారి శ్రీరామ్ మొండయ్య

కరీంనగర్/ధనాధన్ న్యూస్: జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, కొత్తపల్లిలో సుదీర్ఘకాలం ఆంగ్ల ఉపాధ్యాయులుగా సేవలందించిన కనపర్తి రమేష్ ఉద్యోగ విరమణ సమావేశం గురువారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా విద్యాధికారి (DEO) శ్రీరామ్ మొండయ్య హాజరయ్యారు. ఈ
సమావేశంలో శ్రీరామ్ మొండయ్య మాట్లాడుతూ, ఉపాధ్యాయులు విద్యార్థులకు మార్గదర్శకులని అన్నారు. వారి యొక్క క్రమశిక్షణ, పట్టుదల, అంకితభావం పిల్లల భవిష్యత్తుపై చాలా గొప్ప ప్రభావాన్ని చూపుతాయని పేర్కొన్నారు.
పదవీ విరమణ పొందిన కనపర్తి రమేష్ సేవలను ఆయన కొనియాడారు. రమేష్ అనేకమంది విద్యార్థులను ఆంగ్లంలో నిష్ణాతులుగా తీర్చిదిద్దారని, వారి జీవితాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని ప్రశంసించారు. ముఖ్యంగా, వారి అందమైన చేతిరాతతో ఎంతో మందిని మంత్రముగ్ధులను చేశారని గుర్తు చేసుకున్నారు.
ఉద్యోగంలో పదవీ విరమణ అనేది తప్పనిసరి అయినప్పటికీ, వారికి సామాజిక సేవపై ఉన్న ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని, అవసరమైన వారికి వారి సేవలు ఎప్పుడూ అందిస్తూ ఉండాలని ఆయన ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ప్లానింగ్ కోఆర్డినేటర్ మిల్కురి శ్రీనివాస్, జిల్లా సైన్స్ కోఆర్డినేటర్ జయపాల్ రెడ్డి, డి సి బి చైర్మన్ భగవంతయ్య, కొత్తపల్లి మండల విద్యాధికారి తుమ్మ ఆనందం, పాఠశాల ప్రధానోపాధ్యాయులు కన్నం రమేష్ , పాఠశాల అమ్మ ఆదర్శ కమిటీ అధ్యక్షులు సువర్ణ మరియు పాఠశాల శ్రేయోభిలాషులు భోగ సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు.