- హరీశ్‌రావును అడ్డుకున్న పోలీసులు

హైదరాబాద్, జులై 2 (ధనాధన్ న్యూస్): రాష్ట్రంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య రాజకీయ వాగ్వాదం బుధవారం ఉద్రిక్తతకు దారితీసింది. రాష్ట్ర ప్రభుత్వ అప్పులు, గత బీఆర్ఎస్ ప్రభుత్వ ఆర్థిక వ్యవహారాలు, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై ఇరు పార్టీల నేతలు పరస్పరం సవాళ్లు విసురుతున్న నేపథ్యంలో గన్‌పార్క్ కేంద్రంగా రాజకీయ వేడి నెలకొంది.కాంగ్రెస్ తరఫున మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌తో పాటు మాజీ క్రికెటర్ మహ్మద్ అజహరుద్దీన్ గన్‌పార్క్‌కు చేరుకుని చర్చకు సిద్ధమయ్యారు. మరోవైపు, బీఆర్ఎస్ నేతలు కూడా తమ వద్ద ఉన్న ఆధారాలతో గన్‌పార్క్‌కు వస్తామని ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా గన్‌పార్క్, ప్రెస్‌క్లబ్, తెలంగాణ భవన్ పరిసరాల్లో పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు.
తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి హరీశ్‌రావు, కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అప్పులు, ఇతర ఆర్థిక అంశాలపై పూర్తి ఆధారాలతో గన్‌పార్క్‌కు వస్తున్నామని, ప్రజల ముందే వాస్తవాలు వెల్లడిస్తామని తెలిపారు.అనంతరం తెలంగాణ భవన్ నుంచి గన్‌పార్క్‌కు బయల్దేరిన హరీశ్‌రావును పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ సందర్భంగా పోలీసులు, బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య స్వల్ప తోపులాట చోటుచేసుకుంది. దీంతో తెలంగాణ భవన్ పరిసరాల్లో కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
పరిస్థితిని అదుపులో ఉంచేందుకు పోలీసులు అదనపు బలగాలను మోహరించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ భవన్‌కు చేరుకుని పార్టీ నేతలతో సమావేశమయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అప్పులపై బహిరంగ చర్చకు తాము సిద్ధమని బీఆర్ఎస్ నేతలు మరోసారి ప్రకటించారు.ఇదే సమయంలో మంత్రి జూపల్లి కృష్ణారావు కూడా అప్పుల అంశంపై చర్చకు సిద్ధమని ప్రకటించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. గన్‌పార్క్‌లోని అమరవీరుల స్మారకం వద్ద చర్చ నిర్వహించాలని బీఆర్ఎస్ పట్టుబడగా, కాంగ్రెస్ నాయకులు కూడా అదే స్థాయిలో స్పందించారు. దీంతో రాష్ట్ర రాజకీయాలు మరింత వేడెక్కాయి. ప్రస్తుతం గన్‌పార్క్, తెలంగాణ భవన్, ప్రెస్‌క్లబ్ పరిసరాల్లో భారీ పోలీసు బందోబస్తు కొనసాగుతోంది.
