హుజూరాబాద్, జూలై 29(ధనాధన్ న్యూస్): రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి రైతులకు ఎల్‌నినో ప్రభావంతో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలని, హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలు సుఖసంతోషాలతో సుభిక్షంగా జీవించాలని హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి వొడితల ప్రణవ్ కొండగట్టు అంజన్నను ప్రార్థించారు.బుధవారం కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఆధ్వర్యంలో నిర్వహించిన కొండగట్టు గిరిప్రదక్షిణలో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్, మున్నూరు కాపు కార్పొరేషన్ చైర్మన్ బొమ్మ శ్రీరామ్‌తో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు హాజరయ్యారు.గిరిప్రదక్షిణ సందర్భంగా భారీ వర్షం కురిసినప్పటికీ భక్తులు, కాంగ్రెస్ శ్రేణులు ఏమాత్రం వెనుకడుగు వేయకుండా ఆంజనేయస్వామి నామస్మరణతో భక్తిశ్రద్ధలతో గిరిప్రదక్షిణను పూర్తి చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన వొడితల ప్రణవ్.. కోరిన కోర్కెలు తీర్చే కొండగట్టు అంజన్న అనుగ్రహం రాష్ట్ర ప్రజలందరిపై, రైతులపై ఉండాలని, పాడి పంటలతో తెలంగాణ సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు.ప్రపంచవ్యాప్తంగా వాతావరణ శాస్త్రవేత్తలు ఎల్‌నినో ప్రభావంపై ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో, దానిని కాంగ్రెస్ ప్రభుత్వంపై నెట్టేలా బీఆర్‌ఎస్ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని అన్నారు. కౌశిక్ రెడ్డి శాస్త్రవేత్తలా మాట్లాడడం సరికాదని, ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు మానుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో హుజూరాబాద్ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply