
హైదరాబాద్/ధనాధన్ న్యూస్,జూన్ 06: తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత రాష్ట్రంలో భారీ స్థాయిలో భూదందాలు జరుగుతున్నాయని ఆరోపించారు. శనివారం బంజారాహిల్స్‌లోని తెలంగాణ రక్షణ సేన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం లక్ష కోట్ల రూపాయల విలువైన భూములను బడాబాబులకు అప్పగించే కుట్ర చేస్తోందని విమర్శించారు. ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు, మంత్రులు, కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు భూదందాలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ, ఇందుకు సంబంధించిన ఆధారాలను దశలవారీగా ప్రజల ముందుకు తీసుకువస్తానని తెలిపారు.
తెలంగాణ భూములు, వనరులు, సంస్కృతి, అస్తిత్వాన్ని కాపాడేందుకే తెలంగాణ రక్షణ సేనను స్థాపించామని కవిత పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇంచు భూమి కూడా దోపిడీకి గురికాకుండా పోరాటం చేస్తామని, అవసరమైతే సుప్రీంకోర్టు వరకు వెళ్లి న్యాయపోరాటం చేస్తామని స్పష్టం చేశారు.హైడ్రా సంస్థ పేదల భూములను ఖాళీ చేయించడంలో చురుకుగా వ్యవహరిస్తోందని, అయితే ప్రభావశీలుల అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవడంలో విఫలమవుతోందని ఆరోపించారు. కూకట్‌పల్లిలోని మంజీర కాలనీలో పేదలపై చర్యలు తీసుకుంటున్న హైడ్రా, మూసీ నది పరివాహక ప్రాంతంలో నిర్మితమవుతున్న భారీ భవనాల విషయంలో మౌనం పాటిస్తోందన్నారు. శ్రీ ఆదిత్య బిల్డర్స్‌కు సంబంధించిన నిర్మాణాల వెనుక ఓ ఎంపీ ఉన్నారని, త్వరలోనే ఆయన పేరును వెల్లడిస్తానని పేర్కొన్నారు.

ప్రేమవతిపేట పెద్ద చెరువులో సుమారు ఏడు ఎకరాల భూమి ఆక్రమణకు గురైందని ఆరోపించిన కవిత, దీనిపై పూర్తి ఆధారాలతో ఫిర్యాదు చేస్తామని చెప్పారు. అలాగే నాగారం మున్సిపాలిటీ పరిధిలో ఐదు ఎకరాల చెరువు భూమిని ఒక సంస్థ ఆక్రమించిందని, సంబంధిత సర్వే నంబర్లతో సహా వివరాలు తమ వద్ద ఉన్నాయని తెలిపారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కొనుగోలు చేసిన భూములపై కూడా కవిత స్పందించారు. కోడికుంట చెరువు పరిధిలోని శిఖం భూమిని కొనుగోలు చేశారని ఆరోపిస్తూ, అది ప్రభుత్వ భూమి అని తేలితే వెంటనే ప్రభుత్వానికి తిరిగి అప్పగించాలని డిమాండ్ చేశారు. రైతులకు ఇచ్చినట్లే ఆయనకు కూడా తగిన నష్టపరిహారం ఇవ్వాలని సూచించారు.తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎన్నో త్యాగాలు జరిగాయని గుర్తుచేసిన కవిత, తెలంగాణ వనరులు, భూములు, హక్కుల పరిరక్షణ కోసం తమ పోరాటం కొనసాగుతుందని తెలిపారు. ఉద్యమకారులకు భూములు కేటాయించాలని డిమాండ్ చేస్తూ ఉప్పల్ భగాయత్, నాదర్‌గుల్ ప్రాంతాల్లో పోరాట కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వెల్లడించారు.
నీటి సమస్యలపై స్పందించిన ఆమె, రాష్ట్ర ప్రభుత్వం కృష్ణా, గోదావరి జలాల విషయంలో తెలంగాణ ప్రయోజనాలను కాపాడడంలో విఫలమవుతోందని విమర్శించారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని తెలంగాణకు అదనపు నీటి వాటా సాధించాల్సిన అవసరం ఉందన్నారు.