- ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో జాప్యం.. రైతులకు సబ్సిడీ విత్తనాలు, విద్యుత్ సరఫరాలోనూ అన్యాయం
- మండల సమస్యలను పరిష్కరించకపోతే మంత్రిగా ఉండి ప్రయోజనమేమిటి? – సింగిల్ విండో డైరెక్టర్ చాడ ప్రకాష్ రెడ్డి

సైదాపూర్ (ధనాధన్ న్యూస్): సైదాపూర్ మండలాన్ని అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో అధికారులు, ప్రజాప్రతినిధులు చిన్నచూపు చూస్తున్నారని సింగిల్ విండో డైరెక్టర్ చాడ ప్రకాష్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. మండల కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ హుస్నాబాద్‌లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించినప్పటికీ సైదాపూర్ మండలంలో ఇప్పటివరకు కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకపోవడం ఏమిటని ప్రశ్నించారు. మిల్లుల కేటాయింపు, బర్దన్ సరఫరా జరగలేదని, కొనుగోళ్లపై అధికారులు, ప్రజాప్రతినిధులు కనీసం సన్నాహక సమావేశం కూడా నిర్వహించలేదని విమర్శించారు.
ఒకే నియోజకవర్గంలోని హుస్నాబాద్, కోహెడ మండలాల్లో రైతులకు 100 శాతం సబ్సిడీపై వేరుశనగ విత్తనాలు అందిస్తుండగా సైదాపూర్ మండల రైతులకు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. విద్యుత్ సరఫరాలోనూ సైదాపూర్ మండలానికి అన్యాయం జరుగుతోందని, హుస్నాబాద్, కోహెడ మండలాలతో పోలిస్తే తమ మండలానికి రెండు గంటలు తక్కువగా విద్యుత్ సరఫరా చేస్తున్నారని ఆరోపించారు. ఈ విషయంపై ఆయా మండలాల విద్యుత్ సబ్స్టేషన్ల డే బుక్‌లను పరిశీలిస్తే వాస్తవాలు వెల్లడవుతాయని పేర్కొన్నారు.
సైదాపూర్ మండలంలో మార్కెట్ యార్డు నిర్మాణ పనులు ఎప్పుడు ప్రారంభిస్తారని ప్రశ్నించిన ఆయన, విద్యారంగంలోనూ మండలం నిర్లక్ష్యానికి గురవుతోందని అన్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే బాలుర గురుకుల పాఠశాల ఇప్పటికీ హుజూరాబాద్ మండలం బోర్నపల్లిలో అద్దె భవనాల్లో కొనసాగుతోందని తెలిపారు. సైదాపూర్ మండలంలోని రాయికల్, గోడిశాల గ్రామాల్లో ప్రభుత్వ భూములు అందుబాటులో ఉన్నప్పటికీ పాఠశాలకు సొంత భవనాల నిర్మాణానికి నిధులు కేటాయించకపోవడం బాధాకరమన్నారు. మరోవైపు హుస్నాబాద్ మండలంలో విద్యాసంస్థలకు నిధులు కేటాయించి నిర్మాణ పనులు వేగవంతం చేస్తున్నారని, సైదాపూర్ మండలంలోని పాఠశాలల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను కూడా భర్తీ చేయాలని కోరారు.
రోడ్ల నిర్మాణంలోనూ సైదాపూర్ మండలానికి ప్రాధాన్యత ఇవ్వడం లేదని చాడ ప్రకాష్ రెడ్డి విమర్శించారు. సైదాపూర్ మండల కేంద్రం నుంచి భీమదేవరపల్లి మండల కేంద్రానికి కలిపే డబుల్ రోడ్డు ఎప్పుడు మంజూరు చేస్తారని ప్రశ్నించారు. ఎలబోతారం నుంచి అమ్మనగుర్తి వరకు రహదారి పూర్తిగా గుంతలమయమై ఆర్టీసీ బస్సులు కూడా సరిగా తిరగలేని పరిస్థితి నెలకొందన్నారు. బొమ్మకల్ నుంచి వంగర క్రాస్ వరకు రోడ్డు నిర్మాణ పనులు ఎప్పుడు చేపడతారని నిలదీశారు. రాయికల్ బస్టాండ్ నుంచి నల్లని తండా వరకు గిరిజన సంక్షేమ శాఖ కింద మంజూరైన బీటీ రోడ్డు పనులకు టెండర్లు పూర్తయినా ఎనిమిది నెలలుగా పనులు ప్రారంభం కాలేదని తెలిపారు. కాంట్రాక్టర్‌తో అగ్రిమెంట్ కూడా పూర్తికాలేదని సంబంధిత అధికారులు చెబుతున్నారని పేర్కొన్నారు. ఈ రోడ్డు పూర్తయితే రాయికల్, నల్లని తండా, రాయికల్ తండా, పాత తండా మీదుగా ఘనపూర్, సైదాపూర్ ప్రాంతాలకు బస్సు సౌకర్యం కల్పించే అవకాశం ఉంటుందని వివరించారు.
పర్యాటక రంగంలోనూ సైదాపూర్ మండలానికి అన్యాయం జరుగుతోందని ఆయన ఆరోపించారు. సర్వాయి పాపన్న గుట్ట అభివృద్ధి పనులు నత్తనడకన సాగుతున్నాయని, సహజసిద్ధమైన రాయికల్ వాటర్‌ఫాల్స్ అభివృద్ధికి ఇప్పటివరకు నిధులు కేటాయించలేదని అన్నారు. వాటర్‌ఫాల్స్ వద్ద కనీస మౌలిక సదుపాయాలు కూడా కల్పించలేదని, అక్కడికి వెళ్లే రాయికల్ రహదారి సుమారు ఐదు కిలోమీటర్ల మేర గుంతలమయంగా మారి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. రహదారి మరమ్మతుల కోసం డీఎంఎఫ్టీ నిధుల నుంచి రూ.10 లక్షలు మంజూరు చేయాలని కలెక్టర్‌కు మంత్రి సిఫారసు చేసినప్పటికీ ఇప్పటివరకు నిధులు విడుదల కాలేదని పేర్కొన్నారు. వాటర్‌ఫాల్స్ దిగువన ఉన్న మోదిచెరువు సుందరీకరణకు కూడా నిధులు కేటాయించలేదన్నారు. అదే సమయంలో హుస్నాబాద్ మండలంలోని ఎల్లమ్మ చెరువు అభివృద్ధికి కోట్లాది రూపాయలు కేటాయించి పనులు చేపడుతున్నారని విమర్శించారు. సైదాపూర్ మండలంలో బ్రిడ్జిల నిర్మాణానికి సుమారు రూ.2 కోట్లు మంజూరైనట్లు ప్రకటించినప్పటికీ పనులు మాత్రం ప్రారంభం కాలేదని తెలిపారు.
మండలంలో ధాన్యం కొనుగోళ్లు, వ్యవసాయం, విద్యుత్, విద్య, రహదారులు, పర్యాటక రంగం ఇలా అనేక సమస్యలు పేరుకుపోయాయని చాడ ప్రకాష్ రెడ్డి పేర్కొన్నారు. నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా సైదాపూర్ మండలం భవిష్యత్తులో హుజూరాబాద్ నియోజకవర్గంలో కలుస్తుందనే ఆలోచనతోనే ప్రస్తుత పాలకులు మండలాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారా అనే అనుమానాలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయని అన్నారు. మంత్రి వెంటనే స్పందించి సైదాపూర్ మండల సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించి, పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులను ప్రారంభించడంతో పాటు రైతులు, విద్యార్థులు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని చాడ ప్రకాష్ రెడ్డి కోరారు.
