ఇల్లందకుంట, నవంబర్ 25: ఇల్లందకుంట మండల పరిధిలోని మల్లన్నపల్లి గ్రామ సమస్యల పరిష్కారం కోసం తాను అలుపెరుగని పోరాటం చేస్తానని కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ టికెట్ ఆశిస్తున్న గంధం రవీందర్ ప్రకటించారు. ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు ప్రజలు ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీకి అవకాశం కల్పిస్తున్నారని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు.
మంగళవారం గంధం రవీందర్ ఓ ప్రకటనలో మాట్లాడుతూ తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న అభివృద్ధి పనులను దృష్టిలో ఉంచుకొని, ఈసారి సర్పంచ్ ఎన్నికల్లో ప్రజలు యువ నాయకత్వాన్ని బలపరిచి గెలిపిస్తే గ్రామంలోని సమస్యలు పరిష్కారం అవుతాయని విశ్వాసం వ్యక్తం చేశారు.
యువ నాయకత్వానికి అవకాశం కల్పించండి: హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి ఒడితల ప్రణవ్ బాబు ఆశీస్సులతో పార్టీ తరఫున మల్లన్నపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా తాను బరిలో ఉంటున్నట్లు రవీందర్ స్పష్టం చేశారు.
ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటా: “నన్ను గెలిపించినట్లయితే గ్రామ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ సేవ చేసే భాగ్యాన్ని కల్పించాలని” మల్లన్నపల్లి ప్రజలను ఆయన కోరారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభివృద్ధిని చూసి రాష్ట్రంలో కాంగ్రెస్ పట్ల సానుకూల వాతావరణం నెలకొందని, స్థానిక ఎన్నికల్లో కూడా అదే స్పూర్తిని కొనసాగించాలని రవీందర్ విజ్ఞప్తి చేశారు.
