- కాంగ్రెస్కు ఓటు వేయొద్దని,గ్రామగ్రామాన ప్రచారం చేస్తాం
- హవాలా నిధులు’ వ్యాఖ్యలు మానుకోండి
- వెరిఫికేషన్ పేరిట వేధింపులు ఆపాలి
- జమ్మికుంట దళిత పోరాట సమితి పిలుపు
జమ్మికుంట/ధనాధన్ న్యూస్: దళిత బంధు పథకం రెండో విడత నిధులు మంజూరు చేయడంలో జరుగుతున్న జాప్యం, ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై జమ్మికుంట మండలంలోని దళిత లబ్ధిదారులు, దళిత బంధు పోరాట సమితి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నిధులు అందనందున, రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయవద్దని దళితులకు విజ్ఞప్తి చేస్తూ తమ సమితి సభ్యులు మండలంలోని దళితవాడల్లో ప్రచారం చేయనున్నట్లు పోరాట సమితి సభ్యుడు కోడెపాక రక్షిత్ ఒక ప్రకటనలో తెలిపారు.
నాయకుడిపై కోపాన్ని దళితులపై చూపవద్దు!
“ఇదంతా చూస్తుంటే ఎవరో నాయకుడి మీద ఉన్న కోపాన్ని మా దళితుల మీద చూపిస్తున్నట్టు అనిపిస్తుంది. ఆల్రెడీ దళిత బంధు యూనిట్లు నష్టపోయి ఉన్న మా దళిత కుటుంబాల మీద ఈ విచక్షణరహితమైన వెరిఫికేషన్ అనే గుదిబండ మా దళితులపై ఎందుకు?” అని రక్షిత్ ప్రశ్నించారు.
“హవాలా నిధులు” అనే వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం
రెండో విడత దళిత బంధు నిధులను కొందరు “హవాలా నిధులని, పుణ్యానికి వచ్చిన పైసలు” అని కుసంస్కారంతో, కులంకారంతో మాట్లాడుతున్నారని, దీనిపై తాము తీవ్రంగా ఖండిస్తున్నామని రక్షిత్ అన్నారు. “వేల సంవత్సరాల తరబడి వెలివేయబడ్డ జాతులం. 79 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో మొట్టమొదటిసారి 100% సబ్సిడీ స్కీమ్ రావడం ఈ హుజురాబాద్ నియోజకవర్గం దళితుల అదృష్టం. మీ ఇంట్లో నుంచి, మీ బీరువాలో నుంచి డబ్బు తీసి ఈ నిధుల రూపకంగా మాకు ఇవ్వట్లేదు. ఇకపైన ఎవరైనా తప్పుడు కూతలు కూస్తే తగు రీతిలో సమాధానం చెప్తాం” అని రక్షిత్ హెచ్చరించారు.
సంక్షేమ పథకాలపై వివక్ష
దళిత బంధు వచ్చిందనే సాకుతో దళితులకు ఇందిరమ్మ ఇల్లు మరియు రాజీవ్ వికాసం లాంటి ఇతర సంక్షేమ పథకాలు కూడా ఈ ప్రభుత్వం నిలిపివేసిందని, దీనిని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని సమితి సభ్యులు పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఈ పథకాలను పునరాలోచించి ఇవ్వాలని కోరారు.
దళారుల ఆగడాలు భరించలేం!చెక్కుల రూపంలో నిధులు ఇవ్వాలి
“దళారులు చెలరేగి దళితుల సొమ్ము కమీషన్ల రూపకంగా దోచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. కావున ఇకనైనా ప్రభుత్వం మేల్కొని దళిత బంధు నిధులు చెక్కుల రూపకంలో ఇచ్చి దళారుల బారి నుండి దళిత కుటుంబాలను కాపాడాలని” రక్షిత్ విజ్ఞప్తి చేశారు.
డైరీ యూనిట్లపై ఆడిట్ అభ్యంతరాల తొలగింపునకు డిమాండ్
డైరీ ఫార్మ్ లాంటి యూనిట్లపై “ఆడిట్ ఆబ్జెక్షన్” అనే సాకుతో అనేక ఇబ్బందులు కలగజేస్తున్నారని, వాటిని కూడా ఉన్నఫలంగా ఎత్తేసి యూనిట్లు మంజూరు చేయాలని పోరాట సమితి సభ్యులు ప్రభుత్వాన్ని కోరారు.
