- ఘనంగా ఈటెల జన్మదిన వేడుకలు
- రూపాయి బిల్లలతో ఈటెలకు తన అనుచరుడి తులాభారం
శామీర్‌పేట/ధనాధన్ న్యూస్: “ఎన్ని దెబ్బలు తగిలినా, ఎన్ని గాయాలైనా వెనకడుగు వేసే ప్రసక్తి లేదు. పులి బక్కపడినంత మాత్రాన దాని ఒంటి మీద చారలు పోవు” అని మాజీ మంత్రి, బీజేపీ అగ్రనేత ఈటల రాజేందర్ వ్యాఖ్యానించారు. శామీర్‌పేటలోని తన నివాసంలో జరిగిన జన్మదిన వేడుకల సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రస్తుత రాజకీయ పరిణామాలు, తన పోరాట పటిమపై ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.
ప్రజలే నా బలం..వారి కోసమే నా ప్రయాణం
తన పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపేందుకు తరలివచ్చిన వేలాదిమంది అభిమానులు, కార్యకర్తలకు ఈటల కృతజ్ఞతలు తెలిపారు. “కులాలు, మతాలు, పార్టీలకు అతీతంగా వేలాది మంది నన్ను కలిసి ప్రేమను పంచారు. మాలాంటి వారికి ప్రజలే అసలైన శక్తి అని చెప్పడానికి ఇదే నిదర్శనం. జడ్చర్ల వంటి సుదూర ప్రాంతాల నుండి వచ్చి ‘మీ కోసం ఎదురుచూస్తున్నాం అన్నా’ అని ప్రజలు చెబుతుంటే బాధ్యత మరింత పెరిగింది” అని ఆయన భావోద్వేగానికి లోనయ్యారు.
ఉద్యమ చరిత్ర నా రక్తంలో ఉంది
తెలంగాణ ఉద్యమ సమయంలో తన పాత్రను గుర్తు చేస్తూ ప్రభుత్వ తీరును ఎండగట్టారు. “ఒక్కరే ఉద్యమకారుడు, ఒక్కరే అంతా ప్లాన్ చేస్తారని కొందరు భ్రమల్లో ఉన్నారు. కానీ, ఉప్పల్ రైల్వే పట్టాలపై కాల్పుల ఆదేశాలు వచ్చినా వెనకడుగు వేయకుండా నిలబడింది హుజూరాబాద్ గడ్డ. మానుకోటలో రక్తం చిందినా చీమల బారుల్లా ఎదిరించిన వారిలో నేను ఉన్నాను. రక్తం చిందించి, కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ఇది” అని ఈటల స్పష్టం చేశారు.
అంతిమ విజయం ధర్మానిదే!
ప్రస్తుత పాలనపై ఘాటు విమర్శలు చేస్తూ..
డబ్బుతో మేనేజ్ చేయలేరు: “డబ్బులు ఇచ్చి మేనేజ్ చేసి, అనుకూలంగా వార్తలు రాయించుకోవచ్చు. కానీ అంతిమ విజయం ధర్మానిదే అని నమ్మి కళ్లల్లో ఒత్తులు వేసుకుని ఎదురుచూస్తున్నాం.”
కూకటివేళ్లతో పెకిలిస్తారు: “అధికారంలో ఉన్నవారికి వ్యతిరేకంగా ఇప్పుడు ప్రజల నోళ్లు పెగలకపోవచ్చు. కానీ సమయం వచ్చినప్పుడు కూకటివేళ్లతో ఎలా పెకిలించాలో ప్రజలకు తెలుసు. తెలంగాణ ప్రజలు ఇప్పుడు లౌక్యం నేర్చుకున్నారు.”
దోపిడీ కోసం కాదు: “తెలంగాణ తెచ్చుకున్నది దోపిడీ కోసమో, పేదల భూములు లాక్కోవడానికో, ఇళ్లు కూలగొట్టడానికో కాదు.”
నిండు కుండ తొనకదు
నాయకుడికి డిగ్నిటీ ఉండాలని, హోదాను బట్టి బాధ్యతగా వ్యవహరించాలని ఈటల హితవు పలికారు. “నిండు కుండ తొనకదు. మేము ఎప్పుడూ ఒకరి మేలు కోరుతాం తప్ప కీడు కోరము. ఎవరో ఏదో మాట్లాడుతున్నారని ప్రతిదానికీ స్పందించనంత మాత్రాన ఆలోచించడం లేదని అనుకోవద్దు. పదవుల కోసం ప్రలోభాలకు లొంగే వ్యక్తిని కాదని నేను ఇప్పటికే నిరూపించుకున్నాను. ఉన్నంత కాలం ప్రజా పక్షాన, ధర్మం వైపే నిలబడతాను” అని ఆయన స్పష్టం చేశారు.
