పిచ్చికుక్క దాడిలో గాయపడిన వారిని పరామర్శించిన ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్

జగిత్యాల/ధనాధన్ న్యూస్,జూన్ 20: సారంగాపూర్ మండలం పోతారం గ్రామంలో శుక్రవారం రాత్రి పిచ్చికుక్క దాడిలో గాయపడిన బాధితులను జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ శనివారం పరామర్శించారు. పిచ్చికుక్క దాడిలో మహిళలు సహా 11 మందికి పైగా గాయపడగా, వారు జగిత్యాల జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.ఆస్పత్రికి వెళ్లిన ఎమ్మెల్యే బాధితుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గాయపడిన వారు ఆందోళన చెందవద్దని, ప్రభుత్వం తరఫున అవసరమైన అన్ని వైద్య సదుపాయాలు అందిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో అవసరమైన మందులు, వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయని, బాధితులకు ఇప్పటికే యాంటీ రేబిస్ వ్యాక్సిన్ అందించినట్లు చెప్పారు.


రాష్ట్ర ప్రభుత్వం శునకాలకు వ్యాక్సినేషన్‌తో పాటు వాటి జనాభా నియంత్రణకు చర్యలు చేపడుతోందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. గ్రామాల్లోని స్థానిక కుక్కల కంటే ఇతర ప్రాంతాల నుంచి వచ్చే పిచ్చికుక్కల వల్ల ఇటువంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయని అన్నారు. ప్రజలు, ప్రజాప్రతినిధులు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో పోతారం సర్పంచ్ జ్యోతి శ్రీనివాస్, ఏఎంసీ చైర్మన్ గడ్డం నారాయణ రెడ్డి, సమిండ్ల శ్రీనివాస్, బాల ముకుందం, రాజ్‌కుమార్, నక్కల రవీందర్ రెడ్డి, బోనగిరి నారాయణ, వైద్యులు, ప్రజాప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave a comment