
కరీంనగర్/ధనాధన్ న్యూస్: కరీంనగర్‌లో రోజురోజుకీ దిగజారుతున్న శాంతిభద్రతల పరిస్థితిపై బీఆర్ఎస్ పార్టీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్‌ను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, పాడి కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానంద, కల్వకుంట్ల సంజయ్, ముఠా గోపాల్, కాలేరు వెంకటేష్‌తో పాటు ఎమ్మెల్సీలు దేశపతి శ్రీనివాస్, దాసోజు శ్రవణ్ కలిసి కలసి వినతిపత్రం సమర్పించారు.
ఇటీవల కరీంనగర్ నగరంలో వరుసగా జరుగుతున్న జ్యూవెలరీ షాపుల దొంగతనాలు, ప్రజలపై దాడులు, గుంపులుగా తిరుగుతూ భయాందోళనలు సృష్టిస్తున్న సంఘటనలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని నేతలు పేర్కొన్నారు. నగరంలో శాంతిభద్రతల పరిస్థితి పూర్తిగా దెబ్బతిన్నట్లు కనిపిస్తోందని వారు అభిప్రాయపడ్డారు.
ప్రత్యేకంగా ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై జరిగిన దాడిని బీఆర్ఎస్ నేతలు తీవ్రంగా ఖండించారు. ఇది యాదృచ్ఛిక ఘటన కాదని, రాజకీయ కక్షతో జరిగిన దాడిగా పేర్కొన్నారు. ఈ ఘటన వెనుక బీజేపీ నాయకుల ప్రేరణ ఉన్నట్లు డీజీపీ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు.అలాగే ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంపై దాడులు, వాహనాల ధ్వంసం, ప్రజాప్రతినిధులను లక్ష్యంగా చేసుకుని భయానక వాతావరణం సృష్టించడం ప్రజాస్వామ్యానికి మచ్చ అని మండిపడ్డారు. కరీంనగర్ ప్రజలు భయభ్రాంతులకు గురయ్యే పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు.
శాంతిభద్రతలను పరిరక్షించడంలో విఫలమైన కరీంనగర్ పోలీస్ కమిషనర్‌పై వెంటనే చర్యలు తీసుకోవాలని, విధుల్లో నిర్లక్ష్యం వహించిన టూ టౌన్ సీఐపై కఠిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.అదేవిధంగా ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై జరిగిన దాడికి బాధ్యులపై, అలాగే ఘటనకు ప్రేరేపించిన వారిపై వెంటనే కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డీజీపీని కోరారు.
రాష్ట్రంలో ప్రజల ప్రాణాలు, ఆస్తులకు రక్షణ కల్పించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. శాంతిభద్రతలను కాపాడాల్సిన పూర్తి బాధ్యత ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు.