మోడీ స్వచ్ఛత పిలుపుతో కదిలిన బీజేపీ శ్రేణులు

  • జమ్మికుంట గర్ల్స్ హైస్కూల్‌లో భారీ పరిశుభ్రత కార్యక్రమం

జమ్మికుంట/ధనాధన్ న్యూస్,జూన్ 13:
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేపట్టిన స్వచ్ఛ భారత్ అభియాన్‌లో భాగంగా కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో (గర్ల్స్ హైస్కూల్) శనివారం బీజేపీ నాయకులు ప్రత్యేక పరిశుభ్రత కార్యక్రమం నిర్వహించారు. “స్వచ్ఛ పాఠశాల – స్వచ్ఛ భారతం” అనే నినాదంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో బీజేపీ కార్యకర్తలు స్వయంగా శ్రమదానం చేసి పాఠశాల పరిసరాలను శుభ్రపరిచారు.ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలో పేరుకుపోయిన చెత్తను తొలగించడంతో పాటు మొక్కల చుట్టూ పెరిగిన కలుపు మొక్కలను శుభ్రం చేశారు. తరగతి గదుల పరిసరాలు, డ్రైనేజీ ప్రాంతాలు, పాఠశాల ప్రాంగణాన్ని పరిశుభ్రంగా మార్చి విద్యార్థినులకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కల్పించారు.


ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ, పరిశుభ్రత అనేది కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదని, ప్రతి పౌరుడు తన పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాల్సిన సామాజిక బాధ్యత ఉందని పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించిన స్వచ్ఛ భారత్ ఉద్యమ లక్ష్యాలను గ్రామాలు, పట్టణాల స్థాయిలో విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.పాఠశాలలు పరిశుభ్రంగా ఉంటే విద్యార్థుల్లో ఆరోగ్య అవగాహన, క్రమశిక్షణ, బాధ్యతాయుత భావన పెంపొందుతాయని తెలిపారు. చిన్నారులకు పరిశుభ్రతపై అవగాహన కల్పించడం ద్వారా ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి బాటలు వేయవచ్చన్నారు.
కార్యక్రమంలో భాగంగా ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించి, చెత్తను వేర్వేరుగా సేకరించి సరైన విధంగా పారవేసే చర్యలు చేపట్టారు. ముఖ్యంగా వర్షాకాలంలో పరిశుభ్రతను పాటించడం ద్వారా అంటువ్యాధుల వ్యాప్తిని అరికట్టవచ్చని వివరించారు.
ప్రభుత్వ విద్యాసంస్థలను ఆదర్శవంతమైన విద్యా కేంద్రాలుగా తీర్చిదిద్దేందుకు విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు కలిసి కృషి చేయాలని కోరారు.

భవిష్యత్తులో కూడా పాఠశాలలు, దేవాలయాలు, ప్రభుత్వ కార్యాలయాలు, ప్రజా ప్రదేశాల్లో ఇలాంటి స్వచ్ఛత కార్యక్రమాలను నిరంతరం నిర్వహిస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో బీజేపీ మాజీ పట్టణ అధ్యక్షుడు జీడీ మల్లేష్, బీజేపీ తెలంగాణ ఎస్సీ మోర్చా ఎగ్జిక్యూటివ్ మెంబర్ ఠాకూర్ రాజేష్, రాకేష్, యంసాని సమ్మయ్య, కోరే రవీందర్, ఉడుగుల మహేందర్, పత్తి జనార్దన్ రెడ్డి, మోడెం రాజు, శరత్‌తో పాటు పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a comment