
జగిత్యాల/ధనాధన్ న్యూస్,జూన్ 17: జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో జగిత్యాల ఎమ్మెల్యే డా. ఎం. సంజయ్ కుమార్ మాట్లాడారు. కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుపై ఎంపీ ధర్మపురి అరవింద్ అనుచరులు చేస్తున్న వ్యాఖ్యలకు స్పందిస్తూ, కేంద్రీయ విద్యాలయానికి అవసరమైన 5 ఎకరాల స్థల కేటాయింపు ప్రక్రియ పూర్తయిందని తెలిపారు.జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో భూమి సర్వే నిర్వహించి, సంబంధిత పత్రాలను సుమారు పది రోజుల క్రితమే కేంద్రీయ విద్యాలయ సంఘటన్ డిప్యూటీ కమిషనర్‌కు పంపించినట్లు వెల్లడించారు. అయినప్పటికీ కేంద్రీయ విద్యాలయం అంశాన్ని రాజకీయ కోణంలో చూడడం సరికాదని అన్నారు.
కరీంనగర్‌లో మంత్రి పొన్నం ప్రభాకర్ కృషితో 2011లో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు కాగా, 2017లో 7 ఎకరాల స్థలంలో ఎల్‌ఎండీ ప్రాంతానికి తరలించిన విషయాన్ని గుర్తు చేశారు. దేశంలోని ప్రతి జిల్లాకు నవోదయ, కేంద్రీయ విద్యాలయాలను మంజూరు చేయడం కేంద్ర ప్రభుత్వ విధానమని, జగిత్యాల జిల్లా ఏర్పడిన తొమ్మిదేళ్ల తర్వాత ఈ అవకాశం లభించిందన్నారు.కేంద్రీయ విద్యాలయం కోసం తొలుత పాత ఎస్పీ కార్యాలయ భవనాన్ని కేటాయించి, అవసరమైన మరమ్మతులు చేపట్టినట్లు తెలిపారు. అనంతరం చల్గల్ ప్రాంతంలో 5 ఎకరాల భూమిని గుర్తించి, ఆ వివరాలను కేంద్రీయ విద్యాలయ సంఘటన్‌కు పంపించినట్లు చెప్పారు. ఈ ప్రక్రియలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కూడా కృషి చేస్తున్నారని పేర్కొన్నారు.
వాలంటరీ క్షేత్రం భూముల విషయంలో అనవసర ఆరోపణలు చేయడం సరికాదన్నారు. గతంలో పండ్ల వ్యాపారులకు ప్రభుత్వం స్థలాలు కేటాయించిందని, మాజీ మంత్రి జీవన్‌రెడ్డి హయాంలోనూ వ్యాపారులు అక్కడ షెడ్లు ఏర్పాటు చేసుకుని వ్యాపారాలు నిర్వహించారని గుర్తుచేశారు.
వ్యక్తిగత దూషణలు, వ్యక్తిత్వ హననానికి పాల్పడటం రాజకీయాలకు మంచిది కాదని, ప్రజలు అన్నింటినీ గమనిస్తున్నారని అన్నారు. తాను డబ్బుల కోసం రాజకీయాలు చేసే వ్యక్తిని కాదని స్పష్టం చేశారు.2025 ఏప్రిల్ 26న కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి పంపిన లేఖలో చల్గల్ వాలంటరీ క్షేత్రాన్ని శాస్త్రవేత్తలు, రైతుల కోసం జాతీయ సహజ వ్యవసాయ శిక్షణ కేంద్రంగా ఉపయోగించాలని సూచించిందన్నారు. ఆ మేరకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కేంద్రీయ విశ్వవిద్యాలయానికి 2 ఎకరాలు, ఇంటిగ్రేటెడ్ స్కూల్‌కు 10 ఎకరాల భూమి కేటాయించినట్లు తెలిపారు.
ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వాలంటరీ క్షేత్రాన్ని సహజ వ్యవసాయం, ఆర్గానిక్ ఫార్మింగ్ కార్యకలాపాలకు వినియోగించే దిశగా ఆలోచిస్తున్నాయని పేర్కొన్నారు. కేంద్రీయ విద్యాలయం చల్గల్‌లో ఏర్పాటు చేయాలనే జీవో కారణంగా కొన్ని సాంకేతిక ఇబ్బందులు ఉన్నప్పటికీ, ప్రజల ఆకాంక్షల మేరకు జిల్లా కలెక్టర్, రెవెన్యూ అధికారులు పూర్తి సర్వే నిర్వహించి 5 ఎకరాల భూమి ప్రతిపాదనను కేంద్రీయ విద్యాలయ సంఘటన్‌కు పంపించారని తెలిపారు.ఇప్పటికైనా కేంద్రీయ విద్యాలయం అంశంపై రాజకీయాలు మానుకుని, విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని అందరూ సహకరించాలని ఎమ్మెల్యే కోరారు.ఈ సమావేశంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నందయ్య, మాజీ మున్సిపల్ చైర్మన్లు గిరి నాగభూషణం, జ్యోతి లక్ష్మణ్, పీసీసీ కార్యదర్శి బండ శంకర్‌తో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.