- కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన మంత్రి అడ్లూరి

జగిత్యాల/ధనాధన్ న్యూస్, జూన్ 17:(చుక్క గంగారెడ్డి, సీనియర్ జర్నలిస్ట్ – జగిత్యాల):
గత బీఆర్ఎస్ ప్రభుత్వ కాలంలో కల్యాణ లక్ష్మి చెక్కులు, ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల కొరకు లబిద్దారులు కరీంనగర్ వెళ్లే పరిస్థితి ఉండేదని నేడు ప్రజా ప్రభుత్వంలో ధర్మపురి నియోజకవర్గంలోని మండల కేంద్రాల్లోనే లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేస్తున్నామని రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.
బుధవారం జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండల కేంద్రంలో నలుగురు లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి చెక్కులతో పాటు 91 మంది లబ్ధిదారులకు రూ 31 లక్షల 3వేల విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను మంత్రి లక్ష్మణ్ కుమార్ అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత ప్రభుత్వ కాలంలో లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ కరీంనగర్ లో అందించే వారని ఇది పేద ప్రజలకు భారంగా ఉండేదని మంత్రి అన్నారు. ప్రజా ప్రభుత్వంలో ధర్మపురి నియోజకవర్గంలో కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్ లబ్ధిదారులతో పాటు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల సైతం స్థానికంగా అందజేస్తున్నామని మంత్రి తెలిపారు. మొదటి విడత పంపిణీ చేసిన ఇందిరమ్మ ఇల్లు పూర్తి కావడానికి వస్తున్నాయని గృహ ప్రవేశాలకు వెళ్లిన సందర్భంలో పేదల ముఖాల్లో ఆనందం కనిపిస్తుందని మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నారు. రానున్న రోజుల్లో మరింత మందికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని మంత్రి తెలిపారు.

గౌడన్నలకు అండగా నిలుస్తాం : మంత్రి అడ్లూరి
వెల్గటూర్ మండలం జగదేవ్ పేట గ్రామంలో ఇటీవల దగ్దమైన ఈత వనాన్ని మంత్రి లక్ష్మణ్ కుమార్ పరిశీలించారు. అగ్ని ప్రమాదంతో జరిగిన తీరును, నష్టం వివరాలను స్థానిక గౌడ సంఘం నాయకులు మంత్రికి వివరించారు. నష్టపోయిన గౌడన్నలకు ప్రభుత్వ పరంగా అవసరమైన సహాయం అందిస్తామని మంత్రి ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. జగదేవ్ పేట గ్రామంలో బైపాస్ రోడ్డు నిర్మాణం తో పాటు పెద్దమ్మ ఆలయంలో బోరుబావి తవ్వించడంతో పాటు ఎస్సీ కమ్యూనిటీ హాల్ మిగిలిన పనులు పూర్తి చేయాలని స్థానికులు కోరగా గ్రామస్తులు కోరిన పను లు పూర్తి చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు.