ఇందిరమ్మ రాజ్యంలో పేదల సొంతింటి కల నెరవేరుస్తున్నాం

  • ప్రతి ఊరికి ఇందిరమ్మ ఇళ్లు..
  • రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

జగిత్యాల/ధనాధన్ న్యూస్, జూన్ 17:ఇందిరమ్మ రాజ్యంలో పేద ప్రజల స్వంతింటి కల నెరవేర్చుతున్నామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. బుధవారం జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం కొండాపూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు.కొండాపూర్ గ్రామానికి మంజూరైన ఇందిరమ్మ ఇళ్లలో  9 ఇళ్ల పూర్తి కాగా బుధవారం గృహ ప్రవేశాలు నిర్వహించారు. గృహప్రవేశ వేడుకలకు హాజరైన మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వ కాలంలో ఏనాడు పేదల సంక్షేమాన్ని పట్టించుకోలేదని అన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంతో రాష్ట్రంలోని పేద ప్రజల సొంతింటి కలను నిజం చేస్తూ ముందుకు సాగుతున్నామని మంత్రి తెలిపారు.



బీఆర్ఎస్ పాలనలో ఒక డబుల్ బెడ్ రూమ్ ఇంటి నిర్మాణం చేయలేదని మంత్రి అన్నారు. ధర్మపురి నియోజకవర్గాన్ని నియంతల ఏలిన కొప్పుల ఈశ్వర్ ఏనాడైనా ఒక గ్రామంలో ప్రభుత్వం తరఫున నిర్మించిన గృహప్రవేశంలో పాల్గొన్నారా అని ప్రశ్నించారు. పేదల కోసం నిర్మిస్తున్న ఇళ్లపై సైతం బీఆర్ఎస్ నాయకులు విషం కక్కుతున్నారని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.ప్రజా ప్రతినిధిగా గృహప్రవేశ వేడుకల్లో పాల్గొనడం సంతోషంగా ఉందని మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నారు. ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారులకు ప్రభుత్వం నేరుగా వారి ఖాతాల్లో డబ్బులు జమ చేస్తుందని మంత్రి తెలిపారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి రానున్న రోజుల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా కొండాపూర్ ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటుచేసిన సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు.

Leave a comment