మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి

  • ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు కటికరెడ్డి బుచ్చన్న యాదవ్ డిమాండ్

కరీంనగర్/ధనాధన్ న్యూస్,జూన్ 28: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు, మోడల్ స్కూల్స్, రెసిడెన్షియల్ పాఠశాలల్లో పనిచేస్తున్న మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించి, కనీస వేతనం అమలు చేయాలని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి టేకుమల్ల సమ్మయ్య, జిల్లా అధ్యక్షుడు కటికరెడ్డి బుచ్చన్న యాదవ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఆదివారం బద్దం ఎల్లారెడ్డి భవన్‌లోని ఏఐటీయూసీ జిల్లా కార్యాలయంలో తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) కరీంనగర్ జిల్లా మహాసభ సీనియర్ నాయకుడు బొజ్జ సాయిలు అధ్యక్షతన నిర్వహించారు.ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా పాల్గొన్న టేకుమల్ల సమ్మయ్య, కటికరెడ్డి బుచ్చన్న యాదవ్ మాట్లాడుతూ.. అధికారంలోకి వచ్చిన సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం మధ్యాహ్న భోజన కార్మికులకు రూ.18,000 కనీస వేతనం చెల్లిస్తామని, వారి సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చినా, దాదాపు రెండేళ్లు గడుస్తున్నా ఆ హామీలు అమలు కాలేదని విమర్శించారు.

పాఠశాలలు ప్రారంభమైనప్పటికీ పెంచిన మెనూకు అనుగుణంగా నిధులు విడుదల చేయడం లేదని, కార్మికుల వేతనాలు ప్రతి నెలా సకాలంలో బ్యాంకు ఖాతాల్లో జమ కావడం లేదని, గతంలో వండిన భోజనాలకు సంబంధించిన బిల్లులు కూడా ఇంకా చెల్లించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పెండింగ్ బకాయిలను వెంటనే విడుదల చేసి, ప్రతి నెల 5వ తేదీలోపు వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు.అదేవిధంగా ప్రభుత్వం ప్రకటించిన కనీస వేతనాన్ని వెంటనే అమలు చేయాలని, అంగన్‌వాడీ కేంద్రాలకు సరఫరా చేస్తున్నట్లే మధ్యాహ్న భోజన పథకానికి అవసరమైన బియ్యం, పప్పులు, నూనె, గుడ్లు, కూరగాయలు తదితర నిత్యావసర వస్తువులను కూడా ప్రభుత్వమే నేరుగా సరఫరా చేయాలని కోరారు. మెనూ ప్రకారం అవసరమైన అన్ని నిధులను ప్రభుత్వం అందించి కార్మికుల సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.


నూతన జిల్లా కమిటీ ఎన్నిక
మహాసభ అనంతరం తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ జిల్లా నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
గౌరవ అధ్యక్షుడు: టేకుమల్ల సమ్మయ్య
జిల్లా అధ్యక్షుడు: బొజ్జ సాయిలు
ఉపాధ్యక్షులు: లక్ష్మి, దేవమ్మ
ప్రధాన కార్యదర్శి: కె. రజిత
సహాయ కార్యదర్శులు: కవిత, సరోజన
కార్యవర్గ సభ్యులు: సరోజన, కనకమ్మ, కవిత లను ఎన్నుకున్నారు..

Leave a comment