- మాజీ కౌన్సిలర్ సాయిని రమ సేవలను కొనియాడిన నాయకులు

జమ్మికుంట/ధనాధన్ న్యూస్, జూన్ 28: భారత మాజీ ప్రధానమంత్రి, బహుభాషా కోవిదుడు, ఆర్థిక సంస్కరణల పితామహుడు పాములపర్తి వెంకట నరసింహారావు జయంతి సందర్భంగా ఆదివారం జమ్మికుంట పట్టణంలోని క్లాక్ టవర్ వద్ద ఘనంగా వేడుకలు నిర్వహించారు.ఈ సందర్భంగా నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు కలిసి పీవీ నరసింహారావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన దేశానికి అందించిన విశిష్ట సేవలను స్మరించుకున్నారు. ముఖ్యంగా ఆర్థిక సంస్కరణలు, విద్యా రంగం, విదేశాంగ విధానంలో ఆయన చేసిన కృషిని కొనియాడుతూ, ఆయన ఆశయాలను కొనసాగించాలని పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ జమ్మికుంట పట్టణ సుందరీకరణలో భాగంగా 24వ వార్డు మాజీ కౌన్సిలర్ శ్రీమతి సాయిని రమ చేసిన సేవలను ప్రశంసించారు. రాష్ట్రంలో అప్పట్లో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ, మున్సిపల్ కౌన్సిల్‌లో ఏకైక కౌన్సిలర్‌గా ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేశారని పేర్కొన్నారు.అలాగే 24వ వార్డు అభివృద్ధికి కోట్లాది రూపాయల నిధులను తీసుకువచ్చి పలు అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేశారని తెలిపారు. పట్టణ సుందరీకరణలో భాగంగా గ్లోబ్‌తో పాటు క్లాక్ టవర్ నిర్మాణం చేపట్టి ఆ ప్రాంతానికి ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చారని కొనియాడారు.మాజీ కౌన్సిలర్ సాయిని రమ చేసిన సేవలను గుర్తిస్తూ,ఆమెతో పాటు ఆమె కుమారుడు సాయిని రవిని పలువురు నాయకులు శాలువాతో ఘనంగా సన్మానించి అభినందించారు.