హుజూరాబాద్, జూలై 24 (ధనాధన్ డిజిటల్ న్యూస్):మాజీ రాజ్యసభ సభ్యుడు వొడితల రాజేశ్వర్‌రావు దేశ రాజకీయాల్లో, ముఖ్యంగా క్లిష్ట పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వానికి అండగా నిలిచిన గొప్ప నాయకుడని హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి వొడితల ప్రణవ్ అన్నారు. శుక్రవారం వొడితల రాజేశ్వర్‌రావు వర్ధంతి సందర్భంగా హుజూరాబాద్ పట్టణంలోని సైదాపూర్ క్రాస్‌రోడ్డు వద్ద ఉన్న ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

అనంతరం హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డితో కలిసి రాజేశ్వర్‌రావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రణవ్ మాట్లాడుతూ, దేశ రాజకీయాల్లో ప్రభుత్వం క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్న సమయంలో అప్పటి ప్రధానమంత్రి పి.వి. నరసింహారావుకు చేదోడువాదోడుగా నిలిచి ప్రభుత్వాన్ని నిలబెట్టడంలో వొడితల రాజేశ్వర్‌రావు కీలక పాత్ర పోషించారని కొనియాడారు.అలాగే నిరుపేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందాలనే లక్ష్యంతో విద్యాసంస్థలను స్థాపించి, ఉచిత విద్య అందించేందుకు కృషి చేశారని తెలిపారు. ఈ ప్రాంత ప్రజల అభివృద్ధికి రాజ్యసభ సభ్యుడిగా విశేష సేవలందించారని, ఆయన చేపట్టిన అభివృద్ధి పనుల ఆనవాళ్లు నేటికీ కనిపిస్తున్నాయని పేర్కొన్నారు.

తన తాత ఆశయాలను కొనసాగిస్తూ ప్రజలకు మరింత చేరువై సేవ చేయడమే తన లక్ష్యమని ప్రణవ్ స్పష్టం చేశారు. వొడితల రాజేశ్వర్‌రావు చూపిన సేవామార్గం భావితరాలకు స్ఫూర్తిదాయకమని అన్నారు.ఈ కార్యక్రమంలో హుజూరాబాద్ మున్సిపల్ చైర్‌పర్సన్ సుహాసిని, వైస్ చైర్మన్ అంజలి, కౌన్సిలర్లు, దేవాలయ కమిటీల చైర్మన్లు, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్లు, డైరెక్టర్లు, వివిధ మండలాలు, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు, గ్రామాల సర్పంచులు, వార్డు సభ్యులు, బ్లాక్ కాంగ్రెస్, బీసీ, ఎస్సీ, యువజన కాంగ్రెస్, సేవాదళ్, అనుబంధ సంఘాల ప్రతినిధులు, సోషల్ మీడియా, మైనారిటీ విభాగ నాయకులు, సీనియర్ నాయకులు, పార్టీ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply